నందిగామ : చరిత్ర, ఆధ్యాత్మికత, జాతీయ వారసత్వాల అరుదైన కలయికకు కన్హా శాంతి వనం వేదికైంది. గురు తేజ్ బహదూర్ 350వ అమరవీరుల సంవత్సరం, బాబూజీ మహారాజ్ 127వ జయంతి, రాష్ట్ర సంత్ తుక్డోజీ మహారాజ్ 117వ జయంతిని పురస్కరించుకుని గురువారం ఇక్కడ భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, హార్ట్‌ఫుల్‌నెస్ గైడ్ ‘దాజీ’ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 160 దేశాల నుండి వచ్చిన వేలాది మంది ఆధ్యాత్మిక సాధకులు హాజరయ్యారు. తొమ్మిదవ సిక్కు గురువు, ‘హింద్ -దీ – చాదర్’ (భారత రక్షణ కవచం) గా ప్రసిద్ధి చెందిన ఆయన, మత స్వేచ్ఛ, మానవ హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన అత్యున్నత త్యాగాన్ని ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు స్మరించుకుని, ఘన నివాళులర్పించారు. “ప్రపంచ చరిత్రలో గురు తేజ్ బహదూర్ జీ అద్వితీయులని, తన సొంత విశ్వాసం కోసం కాకుండా, ఇతరుల మత స్వేచ్ఛను కాపాడటం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వీరుడని ఆయన సేవలను కొనియాడారు.
హార్ట్‌ఫుల్‌నెస్ వ్యవస్థాపకులు బాబూజీ మహారాజ్ సేవలను గుర్తుచేసుకుంటూ, క్లిష్టమైన యోగా మార్గాన్ని సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారని మంత్రి ప్రశంసించారు. “దేవుడు ఎక్కడో దూరంగా ఉండే వ్యక్తి కాదు, గుండె లోతుల్లో ఉండే ప్రశాంతత అని ఆయన నిరూపించారని, ఆయన చూపిన మార్గం నేడు తెలంగాణను అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చింది” అని పేర్కొన్నారు. కన్హా శాంతి వనం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా, పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణలోని రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, బుద్ధవనం వంటి చారిత్రక కట్టడాలను సందర్శించాలని కోరారు. ఇవి కేవలం రాతి నిర్మాణాలు కావని, మన పూర్వీకుల సృజనాత్మకత, జ్ఞానానికి చిహ్నాలని ఆయన వివరించారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక గ్రంథాలను అతిథులు ఆవిష్కరించారు. “ఒకే మానవత్వం – ఒకే హృదయం” అనే సందేశం ప్రపంచశాంతికి వారధిగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు.