- ఉద్యోగుల సంక్షేమమే మా ప్రధమ ప్రాధాన్యత
- బదిలీల ప్రక్రియ ఆదర్శంగా నిలిచేలా చేపట్టాలి
- అధికారులను ఆదేశించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
హైద్రాబాద్: ఉద్యోగుల సౌలభ్యం, సమానత్వం, పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ శాఖ పరిధిలో బదిలీల ప్రక్రియను ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉద్యోగుల బదిలీల ప్రక్రియను సంక్షేమ శాఖ పరిధిలో పూర్తిగా పారదర్శకంగా, నిష్పాక్షికంగా అమలు చేయాలని సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ అధికారులకు ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో TGSWREIS, TGTWREIS, ఆశ్రమ పాఠశాలలు, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ, దివ్యాంగుల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…దూర ప్రాంతాల్లో దీర్ఘకాలం చాలా సేవలందించిన ఉద్యోగులకు వారు కోరుకున్న ప్రాంతాల్లో పోస్టింగులు కల్పించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులు, దంపతులు ఒకే చోట పనిచేసే “స్పౌస్ కేసులు” వంటి అంశాలను సానుకూలంగా పరిగణించాలని ఆదేశించారు. దుర్భర పరిస్థితుల్లో విధులు నిర్వహించిన వారికి మానవీయ దృక్పథంతో న్యాయం చేయాలని పేర్కొన్నారు. బదిలీలకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించి వాటిని ఉద్యోగులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి దశలో డిజిటల్ పద్ధతులను వినియోగించి మానవ జోక్యం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వేగంగా స్పందించాలని ఆదేశించారు. ఎలాంటి ఒత్తిడి లేదా ఇతర వ్యక్తిగత ప్రభావాలు లేకుండా నిష్పాక్షికంగా ప్రక్రియ కొనసాగించాలని స్పష్టం చేశారు. గురుకుల సంస్థల్లో బోధన నాణ్యత దెబ్బతినకుండా అవసరమైన సిబ్బంది సమతుల్యతను కాపాడాలని చెప్పారు. మహిళా ఉద్యోగులు, దివ్యాంగులు, సీనియర్ ఉద్యోగులకు ప్రత్యేక సౌలభ్యాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
గురుకులాల్లో అమలు చేసిన 370 జీవో కారణంగా ఉద్యోగులు ఎదుర్కొన్న ఇబ్బందులను అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 190 జీవో జారీ చేసినప్పటికీ అమలులో సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ…GO 190 జీవో అమలు సాధ్యాసాధ్యాలను సమగ్రంగా పరిశీలించి అమలు చేసేలా కృషి చేయాలన్నారు. ఉద్యోగులకు అన్యాయం జరగకుండా సమతుల్య నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉద్యోగులు సంతృప్తిగా, మనశ్శాంతితో పనిచేసే వాతావరణం కల్పించడం ద్వారా బోధనలో నాణ్యత మరింత మెరుగవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. సంక్షేమ శాఖలో బదిలీల ప్రక్రియను ఆదర్శంగా నిలిచే విధంగా నిర్వహించాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి (FAC) సంతోష్, TGSWREIS కార్యదర్శి (FAC) శారద, TGTWREIS అధికారులు అదనపు కార్యదర్శి ఎన్.రాజేందర్ రెడ్డి సంయుక్త కార్యదర్శి నట రాజ్. వెంకన్న, లింగారెడ్డి , రాజు బాబు , వేణు గోపాల్ ,దివ్యాంగుల శాఖ డైరెక్టర్ శైలజ SCDD ఇంచార్జి సెక్రటరీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.