- రేపటి నుంచే ‘పర్యాటక వారోత్సవాలు’!
- పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వారసత్వ సంపదను, పర్యాటక శోభను ప్రపంచానికి చాటిచెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే 18 నుంచి 23 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో… భాషా సాంస్కృతిక, పురావస్తు (హెరిటేజ్) శాఖలు, నిథమ్ (NITHM) సంస్థల సంయుక్త సమన్వయంతో ఈ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నారు.
వారోత్సవాల ప్రారంభం సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10:00 గంటలకు: జహీరాబాద్‌లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (SIHM)లో అడ్మిషన్లు, కెరీర్ గైడెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 4:00 గంటలకు: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం సందర్భంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని ‘స్టేట్ మ్యూజియం’లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే వేదికపై కొలనుపాక సైట్ మ్యూజియం, అలంపూర్ సైట్ మ్యూజియం ప్రత్యేక బ్రోషర్లతో పాటు, ‘టూరిస్ట్ గైడ్ ఇన్ తెలంగాణ’ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరిస్తారు.
వారోత్సవాల ముఖ్య ఉద్దేశం.. కార్యకలాపాలు
తెలంగాణలో పర్యాటక రంగానికి ఉన్న అపారమైన అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేయడమే ఈ వారోత్సవాల ప్రధాన లక్ష్యం. ఎకో-టూరిజం ప్రదేశాలను ప్రమోట్ చేయడంతో పాటు, పర్యాటక రంగం ద్వారా యువతకు లభించే ఉపాధి అవకాశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించనున్నారు.
వారోత్సవాల ప్రత్యేక ఆకర్షణలు
హెరిటేజ్ వాక్‌లు: చారిత్రక కట్టడాల ప్రాశస్త్యాన్ని వివరించేలా ప్రత్యేక కార్యక్రమాలు.
స్వచ్ఛత కార్యక్రమాలు: ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో పరిశుభ్రత డ్రైవ్‌లు.
డిజిటల్ ప్రచారం: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లతో ప్రత్యేక కార్యక్రమాలు.
అవగాహన సదస్సులు: జిల్లా స్థాయిల్లో పర్యాటక ప్రాధాన్యతపై ప్రత్యేక సదస్సులు, ప్రచారాలు
జిల్లాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు
ఉత్సవాల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. జానపద కళా ప్రదర్శనలు, వీరత్వానికి ప్రతీక అయిన పేరిణి నృత్యం, శాస్త్రీయ నృత్యాలు, సాహిత్య కార్యక్రమాలు, సంగీత కచేరీల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
పర్యాటక సొగసుల ‘తెలంగాణ’
రాష్ట్రంలో పర్యాటక రంగానికి తిరుగులేని ఆదరణ ఉందని, స్వదేశీ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే ఎన్నో అద్భుత ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. వాటిలో ముఖ్యమైనవి:
- ప్రపంచ వారసత్వ కట్టడం: రామప్ప దేవాలయం.
- ఆధ్యాత్మిక, చారిత్రక కేంద్రాలు: నాగార్జునసాగర్, బుద్ధవనం, అలంపూర్ జోగులాంబ ఆలయం, పానగల్ మ్యూజియం, వరంగల్ చారిత్రక కట్టడాలు.
- ప్రకృతి రమణీయత: లక్నవరం చెరువు, బొగత జలపాతం.
- హైదరాబాద్ హెరిటేజ్: పైగా సమాధులు, రేమండ్స్ టూంబ్స్, గన్‌ఫౌండ్రీ
మౌలిక వసతుల కల్పన, వారసత్వ సంపద పరిరక్షణ, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో పర్యాటక రంగాన్ని సమీకృతంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
మే 23న ‘టూరిజం కాన్క్లేవ్ – 2026’
వారోత్సవాల ముగింపు సందర్భంగా మే 23న హైదరాబాద్‌లో “డెస్టినేషన్ తెలంగాణ: స్ట్రాటజీస్ ఫర్ ది నెక్ట్స్ ఫ్రంటియర్ ఆఫ్ టూరిజం” (Destination Telangana: Strategies for the Next Frontier of Tourism) అనే ఇతివృత్తంతో ప్రతిష్టాత్మక ‘పర్యాటక సదస్సు (టూరిజం కాన్క్లేవ్) – 2026’ నిర్వహించనున్నారు.