
హైదరాబాద్ హబీబ్ నగర్ పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. మంగర్ బస్తీలోని అఫ్జల్ సాగర్ వీధిలో ప్రహరీ గోడ హఠాత్తుగా కుప్పకూలి ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులపై పడింది. ఈ ఘటనలోఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు.. రోషిని (6) , పావని (4), సారిక (4) మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. చిన్నారుల మృతితో వారి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. హాబీబ్ నగర్ పోలీసులు, క్లూస్ టీమ్ చిన్నారుల మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఇల్లు పాతది కావడం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది.