గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మ్యూజియం డే వేడుకలు

హైదరాబాద్‌లోని గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మ్యూజియం డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ కమ్ డైరెక్టర్ సంతోష్ బి.ఎమ్., ఐఏఎస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నెహ్రూ శతజయంతి ట్రైబల్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన కుమ్రం భీమ్, సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశంలోని ప్రతి రాష్ట్రంలో సాధారణంగా ఒక్క గిరిజన మ్యూజియం మాత్రమే ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో ఆరు గిరిజన మ్యూజియంలు ఏర్పాటుచేయడం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. వేగంగా మారుతున్న ఆధునిక సమాజంలో గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, విలువలు తదితర వారసత్వ సంపదను భావితరాలకు పరిచయం చేసే ప్రధాన వేదికలుగా మ్యూజియంలు నిలుస్తాయని అన్నారు.

అలాగే కుమ్రం భీమ్, రాంజీ గోండ్ వంటి గిరిజన వీరులు ప్రజల హక్కులు, స్వేచ్ఛ, స్వాభిమానాల కోసం చేసిన పోరాటాలు, త్యాగాలు తదితర చారిత్రక అంశాలను యువతకు తెలియజేయడంలో గిరిజన మ్యూజియంలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. విద్యార్థులు, యువత ఆసక్తిగా నేర్చుకునే విధంగా గిరిజన మ్యూజియంలను ఇంటరాక్టివ్, డిజిటల్ మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

వచ్చే నవంబర్ 15 నాటికి రాంజీ గోండ్ స్మారక గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంను అత్యాధునిక హంగులతో పూర్తి చేసి, ప్రధానమంత్రిని ఆహ్వానించి ఆవిష్కరించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, టి.ఆర్.ఐ. డైరెక్టర్ సముజ్వల, మ్యూజియం క్యురేటర్ సత్యనారాయణతో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.