- తెలంగాణలో శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, సుస్థిర పట్టణాభివృద్ధి, సర్క్యులర్ ఎకానమీ దిశగా చేపడుతున్న చర్యలను వివరించిన ఉప ముఖ్యమంత్రి
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పట్టణ పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మంగళవారం కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన ప్రారంభమైన రెండు రోజుల “స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0” జాతీయ సమీక్ష సమావేశానికి తెలంగాణ రాష్ట్రం తరఫున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. మొదటి రోజు సమావేశంలో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, వ్యర్థాల శాస్త్రీయ ప్రాసెసింగ్, పాత చెత్త కుప్పల తొలగింపు, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, పీపీపీ విధానాలు, కొత్త ఘన వ్యర్థాల నిర్వహణ(Solid waste Management) నిబంధనల అమలు వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. రాష్ట్రాలు, నగరాలు అమలు చేస్తున్న అనుభవాలు, ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోవడంపై కూడా సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ విధానాలు, సుస్థిర పట్టణాభివృద్ధి చర్యలు, స్వచ్ఛత కార్యక్రమాలు, సర్క్యులర్ ఎకానమీ దిశగా చేపడుతున్న కార్యక్రమాలను ఉప ముఖ్యమంత్రి సమావేశంలో వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ విజన్–2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని భవిష్యత్ అవసరాలకు సరిపోయే విధంగా, సుస్థిరంగా, సమగ్రంగా, పర్యావరణహితంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం CURE, PURE, RARE అభివృద్ధి విధానాన్ని అనుసరిస్తోందని, ఇందులో కోర్ అర్బన్ రీజియన్, పెరి అర్బన్ రీజియన్, రూరల్ అగ్రికల్చరల్ రీజియన్‌ల సమతుల్య అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు. ఘన వ్యర్థాల నిర్వహణ అనేది ఇకపై కేవలం చెత్త సేకరణకు పరిమితం కాదని, అది వాతావరణ మార్పులకు ప్రతిస్పందన, పర్యావరణ సుస్థిరత, సర్క్యులర్ ఎకానమీ, ఉపాధి కల్పన, ఆర్థిక ఉత్పాదకతలతో నేరుగా అనుసంధానమై ఉందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026 దేశంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలో కీలక మార్పుకు దారితీస్తున్నాయని తెలిపారు. కొత్త నిబంధనలు సంప్రదాయ చెత్త సేకరణ, డంపింగ్ విధానాలకే పరిమితం కాకుండా, 4-వే సోర్స్ సెగ్రిగేషన్, వికేంద్రీకృత వ్యర్థాల ప్రాసెసింగ్, పాత డంప్‌యార్డుల శాస్త్రీయ శుద్ధి, వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి, సాంకేతిక ఆధారిత పర్యవేక్షణ, సర్క్యులర్ ఎకానమీ, వార్డు స్థాయి బాధ్యత, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఈ దిశగా నిబంధనలు అమలులోకి రాకముందే పలు చర్యలు ప్రారంభించిందని వివరించారు.
రాష్ట్రంలోని కోర్ అర్బన్ ప్రాంతాల్లో దాదాపు 9,596 ఎలక్ట్రిక్ స్వచ్ఛ ఆటో టిప్పర్లను ప్రవేశపెట్టే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా మున్సిపల్ కార్యకలాపాల్లో కార్బన్ ఉద్గారాలు తగ్గడంతో పాటు, శుభ్రమైన రవాణా విధానానికి మార్గం సుగమం అవుతుందని అన్నారు. వీటిని 4-వే సోర్స్ సెగ్రిగేషన్‌కు అనుగుణంగా విభజిత చెత్త నిల్వ స్థలాలతో రూపొందిస్తున్నట్లు తెలిపారు. QR కోడ్ ఆధారిత పర్యవేక్షణ ద్వారా ఇంటింటి చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వికేంద్రీకృత, పంపిణీ ఆధారిత వ్యర్థాల ప్రాసెసింగ్ వ్యవస్థలకు ప్రాధాన్యం ఇస్తోందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తడి చెత్తను ఉత్పత్తి అయిన ప్రాంతాల సమీపంలోనే ప్రాసెస్ చేయడం, పొడి చెత్తను శాస్త్రీయంగా వేరు చేసి రీసైక్లింగ్ మరియు సర్క్యులర్ ఎకానమీ వ్యవస్థల్లోకి తీసుకురావడం, ల్యాండ్‌ఫిల్ ప్రాంతాలకు కనిష్ట వ్యర్థాలు మాత్రమే చేరేలా చేయడం ప్రభుత్వ విధానమని వివరించారు. తడి చెత్తను నగరాల్లో దూర ప్రాంతాలకు తరలించడం వ్యయభారంతో కూడుకున్నదిగా ఉండటమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా కూడా సుస్థిర విధానం కాదని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.అందుకే వికేంద్రీకృత తడి చెత్త ప్రాసెసింగ్ కేంద్రాల ద్వారా స్థానిక స్థాయిలోనే వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. దీని వల్ల వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్లకు వెళ్లే RDF(Refuse-Derived Fuel) నాణ్యత కూడా మెరుగుపడుతుందని వివరించారు.
పాత డంప్‌యార్డుల శాస్త్రీయ శుద్ధి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిన అంశమని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ డంప్ యార్డ్ విషయంలో ఐఐటీ బాంబే సాంకేతిక సహకారం, సలహా సేవలను పొందుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. దీని లక్ష్యం మొక్కుబడి చర్యలకే పరిమితం కాకుండా, దీర్ఘకాలిక పర్యావరణ నిర్వహణ వ్యూహాన్ని రూపొందించడం, నిరంతర పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడమని పేర్కొన్నారు. అలాగే ఆటోనగర్ డంప్ సైట్‌లో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 22 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను బయోమైనింగ్ ద్వారా ప్రాసెస్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 30 శాతం వ్యర్థాలు ప్రాసెస్ అయ్యాయని వివరించారు. స్వాధీనం చేసుకున్న భూమిని మళ్లీ డంపింగ్ కోసం కాకుండా, భవిష్యత్తులో పార్కులు, క్రీడా సదుపాయాలు, ప్రజా వినియోగ మౌలిక సదుపాయాలుగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. “డంప్ యార్డులను అభివృద్ధి కేంద్రాలుగా మార్చడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం” అని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కింద పట్టణ స్థానిక సంస్థలు, జిల్లా యంత్రాంగాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. గార్బేజ్ వల్నరబుల్ పాయింట్ల తొలగింపు, రెండు వార్డుల్లో స్వచ్ఛ ఆటోలకు QR ఆధారిత పర్యవేక్షణ పైలట్ ప్రాజెక్టు, 1000.72 మెట్రిక్ టన్నుల నిర్మాణ మరియు కూల్చివేత వ్యర్థాల తొలగింపు, ప్రజా ప్రదేశాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లు, పాత చెత్త తొలగింపు, నగరవ్యాప్తంగా ఈ-వేస్ట్ సేకరణ కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమాలు విడివిడిగా చేపట్టిన పారిశుద్ధ్య చర్యలు కాదని, తెలంగాణ విజన్–2047కు అనుగుణంగా పట్టణాల సమ్మిళిత అభివృద్ధికి దోహదపడే సమగ్ర కార్యాచరణలో భాగమని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
జపాన్ దేశంలో ని కిటాక్యుషు నగర అభివృద్ధి మోడల్ ఆధారంగా బండరావిర్యాల, సిద్ధాపూర్ ప్రాంతాల్లో ప్రతిపాదించిన ఎకో టౌన్ తెలంగాణ సర్క్యులర్ ఎకానమీ ప్రయాణంలో ముఖ్యమైన ముందడుగని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి భారత్‌ను 30–35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనలో, తెలంగాణ రాష్ట్రం తన 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంతో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సహా జాతీయ పరిశుభ్రత, పట్టణ పారిశుద్ధ్య ర్యాంకింగ్స్‌లో తెలంగాణ రాష్ట్రం నిరంతరం మెరుగైన ప్రదర్శన కనబరుస్తోందని, ఇది పౌరులు, పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక సంస్థలు, ప్రభుత్వం కలిసి చేస్తున్న కృషికి నిదర్శనమని తెలిపారు. పరిశుభ్రత అనేది కేవలం నగరాల రూపురేఖలకు సంబంధించిన విషయం మాత్రమే కాదని, అది ప్రజారోగ్యం, మానవ గౌరవం, జీవన ప్రమాణాలతో ముడిపడి ఉందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. మహాత్మా గాంధీ భావజాలానికి అనుగుణంగా స్వచ్ఛతను ప్రజా జీవితంలో కీలక విలువగా భావిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “వార్ ఆన్ వేస్ట్ – వేస్ట్ టు వెల్త్” దృక్పథంతో వ్యర్థాల నిర్వహణను పారిశుద్ధ్య కార్యక్రమంగా మాత్రమే కాకుండా, ఆర్థిక విలువ సృష్టించే ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. చెత్తను మూలం వద్దే వేరు చేసి, శాస్త్రీయంగా ప్రాసెస్ చేస్తే అది సంపదగా మారుతుందని తెలిపారు. పరిశుభ్రత ప్రజల జీవనశైలిలో భాగం కావాలంటే చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జపాన్ తరహాలో మొదటి తరగతి నుంచే పాఠశాలల్లో పరిశుభ్రత, వ్యర్థాల వేర్పాటు, పర్యావరణ బాధ్యత వంటి అంశాలను ఆచరణాత్మకంగా బోధించే అంశాన్ని అన్ని రాష్ట్రాలు పరిశీలించాలని ఆయన సూచించారు. వ్యర్థాల నుంచి విద్యుత్, రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ ప్రాజెక్టుల అమలుకు రాష్ట్రాలకు కేంద్రం తగిన ఆర్థిక సహకారం అందించాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. ముఖ్యంగా ఈ రంగంలో ఆధునిక మౌలిక సదుపాయాలు, శాస్త్రీయ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందించే అంశాన్ని సానుకూలంగా పరిశీలించాలని అన్నారు. ప్రజలు, స్థానిక సంస్థలు, పారిశుద్ధ్య కార్మికులు, పరిశ్రమ భాగస్వాములు, వివిధ సంస్థల సహకారంతో తెలంగాణ సుస్థిర పట్టణ నిర్వహణ, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, సర్క్యులర్ ఎకానమీ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ తోఖన్ సాహు, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ కటికితల,స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ శ్రీమతి రూపా మిశ్రా లతో సహా సంబంధిత కేంద్ర ప్రభుత్వ అధికారులు, తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జయేశ్ రంజన్, ముఖ్యమంత్రి కార్యదర్శి శ్రీ మానిక్ రాజ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ ఆర్వీ కర్ణన్‌తో పాటు వివిధ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.