ఈనెల 22న ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక జిల్లాస్థాయి సదస్సులు

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల యాక్షన్ ప్లాన్ పై అన్ని జిల్లాల్లో ఈనెల 22న జిల్లాస్థాయి సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం గత మార్చి 6వ తేదీ నుండి జూన్ 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై 99 రోజుల యాక్షన్ ప్లాన్ ను అమలు చేసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అందులో భాగంగా ఈ నెల 22వ తేదీన అన్ని జిల్లా కేంద్రాలలో జిల్లా స్థాయి సదస్సులు నిర్వహించాలని ఆదేశించింది. ఈ సదస్సుల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో గౌరవ మంత్రులు, ఎం.పి.లు, ఎం.ఎల్.సిలు, ఎం.ఎల్.ఎ.లు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా తగు చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ సదస్సులలో ముఖ్యమంత్రి సందేశం, 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు, ప్రజాప్రతినిధుల సందేశాలు, రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందిన వారి వివరాలు వెల్లడించాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో సూచించారు. ప్రజాపాలనలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న వివిధ సంక్షేమ పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి(200 యూనిట్ల ఉచిత విద్యుత్), మహిళలకు రూ.500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకంతో ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం ఉచిత పంపిణీ, చేయూత పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మహిళా స్వయం సంఘాలకి బ్యాంక్ లింకేజీ ఇందిరా మహిళాశక్తి, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, కొత్త రేషన్ కార్డులు,ఇందిరమ్మ చీరలు, ఎంపిపి/జెడ్ పిపి నిధులతో చేపట్టిన అభివద్ధి పనులపై సదస్సుల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.

అదేవిధంగా ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న కొత్త పథకాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియేట్ విద్యార్థులకు ఉదయం ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం, ఇంటర్మీయేట్ చదివే దివ్యాంగుల విద్యార్థులకు మోటరైజ్డ్ వెహికిల్స్ పంపిణీ, రైతులకు సంబంధించి పంటమార్పిడి విధానాలు, ఆర్గానిక్ ఫామింగ్ గురించి రైతులకు అవగాహన కార్యక్రమాలపై కూడా జిల్లా స్థాయి సదస్సులలో ప్రస్తావించాలని తెలిపారు. ఈ సదస్సులను విజయవంతంగా నిర్వహించేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్స్ పాటించాలని ఆయా విభాగాధిపతులకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.