ఒకే హాస్పిటల్‌లో 2000 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌

  • అరుదైన రికార్డ్ సాధించిన నిమ్స్‌.. అభినందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

నిమ్స్ హాస్పిటల్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. దేశంలో 2 వేల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేసిన ప్రభుత్వ హాస్పిట్‌ల్‌గా రికార్డు సృష్టించింది. 1989లో నిమ్స్‌లో తొలి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయగా, తాజాగా 2000ల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసినట్టు నిమ్స్‌ డైరెక్టర్, డాక్టర్ బీరప్ప శుక్రవారం ప్రకటించారు. నిమ్స్‌ యూరాలజీ, నెఫ్రాలజీ విభాగం డాక్టర్లు, సిబ్బంది అద్భుతమైన పనితీరుతోనే ఈ అచీవ్‌మెంట్‌ను సాధించగలిగామని బీరప్ప తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నిమ్స్‌కు సంపూర్ణ సహకారం అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకి బీరప్ప కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటివరకు 2000 మంది కిడ్నీ రోగులకు నూతన జీవితం ప్రసాదించిన నిమ్స్‌.. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద అండగా నిలిచింది. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో దాదాపు 95 శాతం మంది రోగులు ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌‌ఎఫ్) ద్వారా పూర్తిగా ఉచితంగా చికిత్స పొందినట్లు బీరప్ప వెల్లడించారు. శస్త్రచికిత్స మాత్రమే కాకుండా, అవయవ మార్పిడి అనంతరం జీవితాంతం అవసరమయ్యే మందులను కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నిమ్స్‌ యూరాలజీ విభాగం హెడ్‌, డాక్టర్ రాహుల్‌ రాజ్‌ను బీరప్ప అభినందించారు. యూరాలజీ విభాగం ఆధ్వర్యంలోనే ఈ ఘనత సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. క్లిష్టమైన బహుళ రక్తనాళాల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు, చిన్నారుల్లో ట్రాన్స్‌ప్లాంట్లు, రీ-ట్రాన్స్‌ప్లాంట్లు వంటి సవాలుతో కూడిన ఆపరేషన్లను యూరాలజీ టీమ్‌ విజయవంతంగా నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో ప్రభుత్వ హాస్పిటల్‌లో తొలి రోబోటిక్‌ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ కూడా నిమ్స్‌లోనే నిర్వహించడం విశేషం.

నిమ్స్‌ వైద్య బృందానికి మంత్రి అభినందనలు
నిమ్స్‌ వైద్య బృందం సాధించిన ఈ అరుదైన ఘనతపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లోనూ అత్యాధునిక వైద్యం అందించగల సామర్థ్యం తెలంగాణకు ఉందని నిమ్స్‌ మళ్లీ మళ్లీ నిరూపిస్తోందన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో అవయవ మార్పిడి సేవలను మరింత విస్తరించి, పేదలకు ఉచితంగా అత్యాధునిక, ఖరీదైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఇటీవల గాంధీ హాస్పిటల్‌లో 6 మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్లతో పాటు అత్యాధునిక వసతులతో కూడిన ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. అలాగే, సనత్‌నగర్‌లోని టిమ్స్‌ హాస్పిటల్‌లో కూడా ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఎక్సలెన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్లను సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి వెల్లడించారు. దీంతో ప్రభుత్వ రంగంలోనే అత్యాధునిక అవయవ మార్పిడి సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తాయన్నారు.