‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • ఇంటింటి సర్వేతో ‘ఇందిరమ్మ కుటుంబ జీవితం బీమా’
  • సర్వే పూర్తయిన ఇళ్లకు ప్రత్యేక లోగో స్టిక్కర్లు
  • ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటి నిర్ణయం

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా ప్రణాళిక కార్యక్రమం విజయవంతం కావడంతో, దాని ముగింపు వేడుకలను పురస్కరించుకుని జూన్ 2 నుండి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని కెబినెట్ సబ్ కమిటి అధికారులను ఆదేశించింది. మంగళవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటి సమావేశం జరిగింది. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలు పాల్గొన్నారు.

12 రోజుల పాటు విభిన్న కార్యక్రమాలు
గ్రామ సభ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఇప్పటివరకు నిర్వహించిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాల ప్రగతిని సమీక్షించిన కేబినెట్ సబ్ కమిటి రాబోయే రోజుల్లో ప్రజా భాగస్వామ్యంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా జూన్ 02 నుండి 12 వరకు నిర్వాహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యంగా ‘పర్యావరణ వారోత్సవం’, రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం, మహిళా-శిశు రక్షణ, గృహ నిర్మాణం, పర్యాటక ప్రోత్సాహం, పట్టణాభివృద్ధి, పునర్వినియోగ శక్తి (గ్రీన్ ఎనర్జీ) ప్రాజెక్టుల అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను నిర్వహించాలని నిర్దేశం చేశారు. ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా, అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని మంత్రులు స్పష్టం చేశారు.

ప్రతి కుటుంబానికి ‘ఇందిరమ్మ బీమా’ రక్షణ
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవితం బీమా’ పథకం అమలుపై కేబినెట్ సబ్ కమిటి సుదీర్ఘంగా చర్చించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తింపజేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రులు పునరుద్ఘాటించారు.
బీమా పథకం కీలక నిర్ణయాలు:
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇల్లు కవర్ అయ్యేలా సమగ్ర గృహ స్థాయి డేటా సేకరణ జరపాలి. ఒకవేళ ఎవరైనా మిగిలిపోతే వారి కోసం ప్రత్యేక శిబిరాలు (స్పెషల్ క్యాంపులు) ఏర్పాటు చేయాలి. పథకం ప్రయోజనాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ బీమా పథకానికి ఒక విశిష్టమైన ‘లోగో’ను రూపకల్పన చేయనున్నారు. సర్వే పూర్తయిన ప్రతి ఇంటికి ఈ లోగోతో కూడిన స్టిక్కర్లను అతికించనున్నారు. ఈ మేరకు అన్ని శాఖలు తమ సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను (యాక్షన్ ప్లాన్) వెంటనే సిద్ధం చేసి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణ రావు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిజిపి సి.వి ఆనంద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు జయేష్ రంజన్, వికాస్ రాజు, నవీన్ మిత్తల్, వాణి ప్రసాద్, దాన కిషోర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు సందీప్ కుమార్ సుల్తానీయా, గౌరవ్ ఉప్పల్, తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.