రైతు డిస్కం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈఆర్సీ ముందు పార్టీ తరఫున వాదనలు వినిపించిన మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యేక రైతు డిస్కం ఆలోచనలను వెంటనే వెనక్కి తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతన్నలకు అందుతున్న 24 గంటల ఉచిత విద్యుత్తును రద్దు చేసేందుకే ప్రత్యేక రైతు డిస్కం ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకు వచ్చిందని బిఆర్ఎస్ పార్టీ మండిపడింది. ఈ మేరకు రైతు డిస్కం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈఆర్సీ ముందు పార్టీ తరఫున మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి సింగ్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలు తమ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన “రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ” నిజానికి రైతుల ప్రయోజనాల కోసం కాదని, రైతులకు అందుతున్న ఉచిత విద్యుత్‌ను క్రమంగా ఎత్తివేసి విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు రూపొందించిన కుట్రలో భాగమని ఆరోపించారు. రైతు డిస్కామ్ పేరుతో ఏర్పాటు చేస్తున్న సంస్థ రైతులను చీకట్లలోకి నెట్టే “ఉరి డిస్కామ్”గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈరోజు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో తమ వాదనలు వినిపించిన అనంతరం మాజీ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడో డిస్కామ్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ERC) నిర్వహించిన ప్రజా విచారణలో పాల్గొని తమ అభ్యంతరాలను నమోదు చేసినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతులకు, గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా అందించామని గుర్తు చేశారు. 2017లో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ను ప్రారంభించి, ఐదేళ్లపాటు ఎటువంటి అంతరాయం లేకుండా విజయవంతంగా అమలు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొస్తున్న మూడో డిస్కామ్ ప్రతిపాదన వెనుక అసలు ఉద్దేశ్యం రెగ్యులర్ ఆదాయం వచ్చే వినియోగదారులను ఒకవైపు, సబ్సిడీ పొందే రైతు కనెక్షన్లను మరోవైపు వేరు చేసి, భవిష్యత్తులో ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేయడమేనని ఆరోపించారు. ఇది విద్యుత్ వ్యవస్థను విభజించి రైతులను ఒంటరిగా చేసే ప్రమాదకర చర్య అని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో ఏ విధమైన నిర్మాణాత్మక మార్పు చేయాలన్నా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ERC) అనుమతి తప్పనిసరి అని గుర్తు చేసిన జగదీశ్ రెడ్డి, ERC అనుమతి రాకముందే ముఖ్యమంత్రి మూడో డిస్కామ్ ప్రారంభ తేదీని ప్రకటించడం నియంత్రణ సంస్థల అధికారాలను అవమానించడమేనని విమర్శించారు. ఈ అంశాన్ని కూడా ప్రజా విచారణలో ప్రస్తావించినట్లు తెలిపారు. ప్రభుత్వం మూడో డిస్కామ్ అవసరాన్ని సమర్థించేందుకు చెబుతున్న కారణాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని అన్నారు. రైతుల పేరుతో విద్యుత్ చౌర్యాలు జరుగుతున్నాయని ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు రైతాంగాన్ని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నమని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులపై మోపిన ముద్రను ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పునరావృతం చేస్తోందని విమర్శించారు.
ఈ కొత్త వ్యవస్థ అమలైతే ప్రస్తుతం రైతులకు అందుబాటులో ఉన్న విద్యుత్ సేవలు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న లైన్మెన్లు, ఫీల్డ్ సిబ్బంది సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని, ఒక మండలానికి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే లైన్మెన్లు ఉండే పరిస్థితి వస్తుందని చెప్పారు. వేలాది వ్యవసాయ కనెక్షన్లు, వందలాది ట్రాన్స్‌ఫార్మర్ల బాధ్యత ఒక్కరి భుజాలపై పడుతుందని, దీంతో విద్యుత్ అంతరాయాలు ఎదురైనప్పుడు రైతులకు వెంటనే సేవలు అందకపోయే ప్రమాదం ఉందన్నారు. అదే విధంగా రైతులకు ప్రస్తుతం ఉన్నట్లుగా సబ్‌స్టేషన్ల వద్ద అధికారులను నేరుగా సంప్రదించే అవకాశం కూడా ఉండదని తెలిపారు. విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు రైతులు పూర్తిగా వ్యవస్థపై ఆధారపడాల్సి వస్తుందని, ఇది రైతాంగాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టే పరిణామమని పేర్కొన్నారు. మూడో డిస్కామ్ ప్రతిపాదన రైతుల ప్రయోజనాలకు పూర్తిగా వ్యతిరేకమని, తెలంగాణ రైతాంగ భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. ఈ ప్రతిపాదనను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, తమ అభ్యంతరాలను రాతపూర్వకంగా ERCకి సమర్పించినట్లు వెల్లడించారు. రైతాంగం అప్రమత్తంగా ఉండి ఈ చర్యలపై పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.