- ఏ గూడెంలో గుడిసె లేకుండా పక్కా ఇల్లు నిర్మిస్తాం…
- ఇందిరమ్మ ఇల్లు పొందిన ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణం పూర్తి చేయాలి
రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కొలాం కొఠారి గ్రామపంచాయతీలోని కొత్తగూడ గ్రామంలో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క) జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేకానంద, పార్లమెంటు సభ్యులు వేమ్ నరేందర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు, జిల్లా కలెక్టర్ కె.హరిత, ఆసిఫాబాద్ శాసనసభ్యులు కోవ లక్ష్మీ, గ్రామ సర్పంచ్ మడావి సంపాబాయి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆదివాసి బిడ్డలందరికీ ప్రభుత్వం నుంచి అమలు చేసే ప్రతి పథకాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, ఆదివాసీల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఆదివాసీల జీవితాలలో వెలుగులు నింపుతామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇండ్లు అందించడం జరిగిందని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ సమన్వయంతో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలోని గూడాలు, ఆదివాసి ప్రాంతాలలో ప్రత్యేకంగా 21 వేల ఇండ్లు కేటాయించి అర్హులైన వారికి అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏ గిరిజన గూడెంలో గుడిసె లేకుండా పక్క ఇండ్లు నిర్మిస్తామని, అర్హత గల ప్రతి ఒక్కరికి ఇల్లు అందిస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు 2వ విడత కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడి నుండి ప్రారంభిస్తున్నామని, 1 లక్ష ఇండ్లు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని, 2 లక్షల 50 వేల ఇండ్లతో 2వ విడత కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి అర్హత గల ప్రతి ఆదివాసి గిరిజనులకు ఇల్లు కేటాయించి నిర్మించుకునేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మహిళలను ఇంటి పెద్దగా గుర్తించి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, సన్న బియ్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేస్తూ స్వయం సహాయక సంఘాల మహిళల రుణ పరిమితిని 5 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను వివిధ వ్యాపార రంగాలలో భాగస్వాములను చేయడం జరుగుతుందని, మహిళలను బస్సులకు యజమానులను చేస్తూ రాష్ట్రంలో 1 వేయి బస్సులను కేటాయించడం జరిగిందని, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్ల నిర్వహణలో మహిళలకు అవకాశం కల్పించి ఆర్థిక అభివృద్ధి దిశగా ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ఇల్లు రానివారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అర్హత గల ప్రతి ఒక్కరికి అందించేందుకు కృషి చేస్తున్నామని, ఇందిరమ్మ ఇల్లు పొందిన వారు ఇల్లు నిర్మించుకోవాలని తెలిపారు. పోటీ ప్రపంచంలో విద్య ఎంతో అవసరమని, ఆదివాసి గిరిజనులు తమ పిల్లలను తప్పకుండా చదివించుకోవాలని, ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలని తెలిపారు. మహిళలు తమ సంపాదనను పొదుపు చేసుకోవాలని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవాలని తెలిపారు.
రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలను తెలుసుకొని సమకూర్చేందుకు ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని తెలిపారు. అర్హత గల ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేసి గూడు కల్పించడం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో మారుమూల గ్రామానికి వచ్చి ఇందిరమ్మ ఇండ్లు 2వ విడత కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్ర మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసి పి వి టి జి గూడాలలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. కూడు – గూడు – గుడ్డ అందించడంతో పాటు పిల్లలందరికి సరైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు కేటాయించడం జరిగిందని, జిల్లాలో జనాభా ప్రాతిపదికన అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కొలాం కొఠారి గ్రామపంచాయతీలోని కొత్తగూడ గ్రామంలో గల సిడం కన్నీబాయి, టేకం పగ్గుబాయి, ఆత్రం పోచుబాయి లకు చెందిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించి కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. అనంతరం గ్రామంలో షియర్ వాల్ సాంకేతికతతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
