తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా SIR మూడో దశ ప్రక్రియ

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఓటరు జాబితాను ప్రక్షాళన చేసేందుకు భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision – SIR) మూడో దశ ప్రక్రియను తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా నిర్వహించేందుకు హైదరాబాద్ లో మంగళవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి భారత ఎన్నికల సంఘం (ECI) సీనియర్ అధికారులు అయిన ప్రధాన కార్యదర్శి శ్రీ అవినాష్ కుమార్, ఉప కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ నేతృత్వం వహించారు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసి కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి (DEO), హైదరాబాద్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, అలాగే హైదరాబాద్ , మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాల ఎన్నికల అధికారులు (EROs) , సహాయ ఎన్నికల నమోదు అధికారులు (AEROs) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి ఐఎఎస్ అధికారులనుద్దేశించి ప్రసంగిస్తూ అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలు, SIR కోసం నియమించిన సిబ్బంది (EROs, AEROs, BLO సూపర్ వైజర్లు, BLOలు), ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల గురించి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 68.30% మ్యాపింగ్ పూర్తయిందని ఆయన తెలిపారు. భారత ఎన్నికల సంఘం అధికారులు Special Intensive Revision – SIR పై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో భారత రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనలు, ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950, ఓటర్ల నమోదు నియమాలు-1960 గురించి వివరించారు. అలాగే SIR యొక్క ప్రాముఖ్యతను వివరించి, ఈ ప్రక్రియలోని ముఖ్య దశలను, ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలు, నోటీసుల జారీ, వాటి పరిష్కారం, తుది ఓటరు జాబితా ప్రచురణ తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు.

గణన ఫారాలను నింపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ECI అధికారులు సూచించారు. అధికారిక పోర్టల్ (voters.eci.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో గణన ఫారాల సమర్పణను విస్తృతంగా ప్రచారం చేయాలని, అలాగే ఓటర్లకు SIR గురించి త్వరితగతిన సమాచారం అందించే “బుక్ ఎ కాల్” సదుపాయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు. అలాగే జిల్లా ఎన్నికల అధికారులు క్రమం తప్పకుండా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి, బూత్ లెవల్ ఏజెంట్లను (BLAs) SIR ప్రక్రియలో చురుకుగా భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి, ఐఎఎస్, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి ఎం. సత్యవాణి, జిహెచ్‌ఎంసి కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్.వి. కర్ణన్, ఐఎఎస్, మేడ్చల్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం. మనూ చౌదరి, ఐఎఎస్, అదనపు కార్యదర్శి, రాష్ట్ర మీడియా నోడల్ అధికారి ఎన్. శంకర్, డిప్యూటీ CEO (FAC) జి.ఎస్. చారి, రాష్ట్ర నోడల్ అధికారులు బి. చెన్నయ్య, ఎన్. ప్రసూనాంబ, PM (IT) చిరంజీవి పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జరిగిన పరస్పర చర్చా కార్యక్రమంలో EROలు, AEROలు లేవనెత్తిన పలు సాంకేతిక , పరిపాలనా సందేహాలకు ECI బృందం సవివరణలు ఇచ్చింది.