తెలంగాణ విత్తన రంగ అనుభవం నైజీరియా యువతకు ఉపయోగపడాలి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • తెలంగాణలో శిక్షణ పొందిన టరాబా రాష్ట్ర యువతకు సర్టిఫికెట్ల ప్రదానం
  • వ్యవసాయం, విత్తన రంగాల్లో తెలంగాణ – టరాబా రాష్ట్రాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం
  • శామీర్‌పేట్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్‌లో అంతర్జాతీయ విత్తన విద్య, పారిశ్రామిక అభివృద్ధి శిక్షణ కార్యక్రమం ముగింపు కార్యక్రమం
  • మంత్రి వివేక్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల

శామీర్‌పేట్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ (IPE)లో నిర్వహించిన “అంతర్జాతీయ విత్తన విద్య మరియు పారిశ్రామిక అభివృద్ధి శిక్షణ కార్యక్రమం” బుధవారం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి మరో మంత్రి వివేక్ తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే విత్తన రంగానికి కేంద్రంగా గుర్తింపు పొందిందని, ఆ అనుభవాన్ని నైజీరియాలోని టరాబా రాష్ట్ర యువతతో పంచుకోవడం సంతోషకరమన్నారు. ఈ శిక్షణ ద్వారా యువత విత్తన ఉత్పత్తి, హైబ్రిడ్ సీడ్ టెక్నాలజీ, విత్తన శుద్ధి, ప్రాసెసింగ్, వ్యవసాయ వ్యాపార నిర్వహణ వంటి అంశాల్లో ప్రాయోగిక పరిజ్ఞానం పొందారని తెలిపారు. టరాబా రాష్ట్ర ప్రభుత్వం తమ యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ కల్పించేందుకు చూపుతున్న చొరవ అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా టరాబా రాష్ట్రంతో వ్యవసాయం, విత్తన సాంకేతికత, రైతు శిక్షణ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

తెలంగాణ మరియు టరాబా రాష్ట్రాల మధ్య “సిస్టర్ స్టేట్” భాగస్వామ్యానికి సంబంధించి చర్చలు కొనసాగుతున్నాయని, ఇది ఇరు ప్రాంతాల మధ్య పరస్పర అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఈ రెండు సంవత్సరాలలో సాధించిన ప్రగతిని మంత్రి వివరించారు. టరాబా రాష్ట్ర యువత ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలను తమ ప్రాంత అభివృద్ధికి వినియోగించి వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను సృష్టించాలని మంత్రి తుమ్మల ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, సీడ్ కార్పోరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, నైజీరియాలోని టరాబా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ అగ్బు కెఫాస్, టరాబా సీడ్స్ లిమిటెడ్, ప్రసాద్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ ప్రతినిధులు, శిక్షకులు, అధికారులు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసిన యువతకు సర్టిఫికెట్లు అందజేశారు.