ప్రజలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తేనే పట్టణ పరిధిలో భీమ్గల్ ను సుందరంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దడానికి వీలవుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి శుక్రవారం నాడు సంబంధిత అధికారులతో కలిసి భీంగల్ పట్టణంలో మూడు గంటల పాటు బెజ్జోర బైపాస్ రోడ్డు టు నంది గల్లీ, అప్పర్ టేక్డితో పాటు పలు వీధులలో పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నారు.ప్రజల ఇబ్బందులను అడిగారు.ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు లను స్వీకరించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.పాదయాత్రలో వృద్ధులు ఎదురు వచ్చి మంత్రిని ఆప్యాయంగా పలకరించారు.మంత్రి వారి యోగక్షేమాలు అడిగారు.పెన్షన్ రావడం లేదని కొందరు మహిళలు,వృద్ధులు మంత్రి దృష్టికి తీసుకురాగా..అర్హులైన అందరికీ పెన్షన్ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారులే మీ వద్దకు వస్తారని, మీరు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇచ్చారు. బైపాస్ రోడ్డు వద్ద పట్టణ ప్రగతి కమిటీల సభ్యులతో మహిళలతో మీడియా ప్రతినిధులతో అధికారులతో పోలీస్ అధికారులతో మొక్కలు నాటించి తాను కూడా పలు మొక్కలను నాటి నీరు పోశారు. భీంగల్ నుండి నిజామాబాద్ వయా వేల్పూర్ కొత్తగా బస్సు నడపడానికి జెండా ఊపి బస్సును ప్రారంభించారు.