క్యూర్ పరిథిలో ఇందిరమ్మ ఇండ్లు ఎల్ ఐజి స్కీం స్థలాల పరిశీలించిన ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతం

  • ఖైరతాబాద్ లో పర్యటించిన గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతం
  • 2బిహెచ్ కె పనులను పూర్తి చేయాలి
  • భూముల వినియోగానికి సమగ్రమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశం

హైదరాబాద్ : క్యూర్ ఏరియా పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు –ఎల్ఐజి హౌసింగ్ స్కీం ను అమలు చేసేందుకు అనువైన స్థలాలను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లోనూ భూమూలను హౌసింగ్ బోర్డు, రెవెన్యూ అధికారులు గుర్తించగా, గురువారం నాడు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతం పర్యటించారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని ఉన్న హౌసింగ్ బోర్డు స్థలాలు, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ఎటువంటి తరహా నిర్మాణాలను చేపట్టాలన్న దానిపై సమగ్రమైన ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సుమారు 3 గంటల పాటు రెవెన్యూ, హౌసింగ్ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. అంబేద్కర్ నగర్ లోని 2 బిహెచ్ కె నిర్మాణాలను పూర్తి చేసేందుకు యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. క్యూర్ ఏరియా పరిధిలో పైలట్ ప్రాజెక్టు కింద 12,000 ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున, అందుకు తగ్గట్లుగా నిర్మాణాలను చేపట్టడానికి తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. ప్రధానంగా స్లమ్ రీ డెవలప్ మెంట్, ఎల్ ఐజి నిర్మాణాలు వంటి కార్యక్రమాల్లో ఏ భూములను వేటికి వినియోగించనున్నారన్న సమాచారాన్ని అధికారుల నుంచి ప్రత్యేక కార్యదర్శి శ్రీ వి.పి.గౌతం తెలుసుకున్నారు. గృహ నిర్మాణ పథకాలు చేపట్టడానికి అనువుగా లేని భూముల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా క్షేత్ర స్థాయి అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రశాశన్ నగర్, బిఎన్ఆర్ నగర్, జర్నలిస్టు కాలనీ, ఎంఆర్ సి కాలనీ, పద్మాలయా స్టూడియోస్ సమీపంలోని అంబేద్కర్ నగర్, హకీంబాబా దర్గా, జహీరానగర్, గురుబ్రహ్మనగర్, దుర్గాభవాని నగర్ తదితర ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. గృహ నిర్మాణ పథకాల అమలు చేయడానికి అనువైన సుమారు 15 భూములను ఏ పథకాలకు వినియోగించాలన్న దానిపై సమగ్రమైన డిపిఆర్ ను రూపొందించి వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపాలని ఆయన సూచించారు. ఈ పర్యటనలో హైదరాబాద్ జిల్లా హౌసింగ్ పిడి అశోక్ చక్రవర్తి, హోసింగ్ బోర్డు అధికారులు డి. మధుకర్ రెడ్డి, జి. వాణి, రవీందర్ రెడ్డి లతో పాటు స్థానిక తహశీల్దార్ శ్రీమతి అనిత తదితరులు పాల్గొన్నారు.