మత్స్యకారులు, మత్స్యరంగ అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మత్స్యకారులు, మత్స్యరంగ అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం NTR స్టేడియంలో హైదరాబాద్ జిల్లా మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో మత్స్యశాఖ, జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ ల సహకారంతో ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభిమతం అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుందని, ఈ సంవత్సరం 83 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేసినట్లు వివరించారు. అంతేకాకుండా మత్స్యకారులకు వెయ్యి కోట్లతో సబ్సిడీపై వాహనాలు, వలలు పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో అనేక చోట్ల చేపల విక్రయాల కోసం మార్కెట్ లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. చేపలను తినడం వలన శరీరానికి పౌష్టికాహారం లభిస్తుందని చెప్పారు. చేపల వంటకాలను తినడం వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసేందుకు ఇలాంటి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ లను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు చేపలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జీహెచ్ఎంసీ పరిధిలో 150 మొబైల్ ఔట్ లెట్ లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివరించారు. త్వరలో ఏర్పాటు చేయనున్న మొబైల్ ఔట్ లెట్ ల నిర్వహణను మత్స్య సహకార సంఘాల మహిళలకు అప్పగించ నున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క మత్స్య కారుడికి అందాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమని, అందుకోసం ప్రతి ఒక్క మత్స్యకారుడు మత్స్య సహకార సొసైటీ లలో సభ్యులుగా నమోదు కావాలని సూచించారు. మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ముందుగా ఫెస్టివల్ సందర్భంగా వివిధ రకాల చేపల వంటకాల స్టాళ్ళ ను మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముటా గోపాల్, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, NFDB డైరెక్టర్ జనార్ధన్, మహిళా మత్స్య సహకార సంఘం అధ్యక్షురాలు పద్మ తదితరులు పాల్గొన్నారు.