తెలంగాణ భవన్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సాంస్కృతిక వేడుకలు

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్, న్యూఢిల్లీలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి & క్రీడల సలహాదారు ఏ.పీ. జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు జితేందర్ రెడ్డి తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సంస్కృతి, హస్తకళలు, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శన స్టాళ్లను సందర్శించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపన అనంతరం తెలంగాణ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు రెసిడెంట్ కమిషనర్ డా. శశాంక్ గోయల్ స్వాగత ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, తెలంగాణ రైజింగ్–2047 విజన్, దేశ రాజధానిలో తెలంగాణ భవన్ పోషిస్తున్న కీలక పాత్రను ఆయన వివరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మహబూబాబాద్‌కు చెందిన నాట్యశ్రీ ఉదయశ్రీ మనోజ్ సారధ్యం లో వారి తాండవకృష్ణ నృత్యాలయ బృందం ప్రదర్శించిన వినాయక కౌత్వం, వందేమాతరం, జయ జయహే తెలంగాణ, రుద్రమదేవి నృత్య రూపకం మరియు దేవీ స్తుతి ప్రదర్శనలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. ప్రముఖ శాస్త్రీయ గాయకులు గద్వాల చంద్రశేఖర్ రావు మరియు వారి బృందం ఆలపించిన అన్నమయ్య కీర్తనలు సభికులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఏ.పీ. జితేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అని అన్నారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పధకాలు, ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్, తెలంగాణ భవన్ అధికారులు, ఇతర సిబ్బంది,తెలంగాణ ఉద్యమకారులు, అధికారులు, ఢిల్లీలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అలాగే వివిధ రాష్ట్రాల భవనాల రెసిడెంట్ కమిషనర్లు కూడా పాల్గొని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు శుభాకాంక్షలు తెలిపారు.