హైదరాబాద్ : రాష్ట్రంలో నీట్-2026 పరీక్ష ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం సచివాలయం నుండి అదనపు డి జి పి మహేష్ భగవత్, పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సి.పి.లు, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీట్-2026 పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు, వరి ధాన్యం కొనుగోలు, జూన్ 9న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి సభ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 21వ తేదీన జరగనున్న నీట్-2026 పరీక్షకు 24 పట్టణాలలో 208 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 72 వేల 956 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఇందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని, రాష్ట్ర, జిల్లా సమన్వయ కమిటీలు అందుకు అనుగుణంగా పని చేయాలని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులపై తక్షణమే స్పందించాలని, వదంతులు వ్యాప్తి కాకుండా చూడాలని తెలిపారు. ప్రభుత్వ సంస్థలలో మాత్రమే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాలలో సి సి కెమెరాలు ఏర్పాటు చేయాలని, అంతర్జాతీయ యోగా దినోత్సవం దృష్ట్యా పరీక్ష నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. పరీక్ష రోజున ప్రశ్న పత్రాల తరలింపు, అభ్యర్థుల రిజిస్ట్రేషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, అభ్యర్థుల తనిఖీ, బందోబస్తు తదితర ఏర్పాట్లను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపట్టాలని తెలిపారు. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు పరీక్షకు చేపట్టిన ఏర్పాట్లపై సమావేశాంలో వివరించారు. పరీక్షల నిర్వహణ సజావుగా సాగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, రవాణా, భద్రత, విద్యుత్ సరఫరా, తాగునీరు, ఇతర సౌకర్యాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ మహేష్ భగవత్ మాట్లాడుతూ, పోలీసు శాఖ, జిల్లా యంత్రాంగం మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, నిరంతర అప్రమత్తత పాటించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పుకార్లు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ, పరీక్షల నిర్వహణపై ప్రభావం చూపే తప్పుడు సమాచారాన్ని వెంటనే గుర్తించేందుకు సామాజిక మాధ్యమాలను చురుకుగా పర్యవేక్షించాలని సూచించారు.
జాతీయ పరీక్షా సంస్థ (NTA) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, ఈ ఏడాది పరీక్షల కోసం మరింత కట్టుదిట్టమైన భద్రతా విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా ప్రశ్నాపత్రాల రవాణా కోసం తొలిసారిగా భారత వైమానిక దళం సేవలను వినియోగిస్తున్నామని, పరీక్షల సమగ్రత, భద్రతకు ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలు కార్యక్రమాలను సమీక్షించిన ప్రధాన కార్యదర్శి, రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రాబోయే కొద్ది రోజుల పాటు కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోత పూర్తయిన ధాన్యాన్ని రక్షించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఇంకా ధాన్యం నిల్వ ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 71 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి, ఇప్పటి వరకు 10 లక్షల 58 వేల మంది రైతుల ఖాతాలలో 13 వేల 577 కోట్ల రూపాయల కనీస మద్దతు ధర జమ చేయడం జరిగిందని, మిగిలిన ధాన్యాన్ని కూడా త్వరితగతిన కొనుగోలు చేసి కొనుగోలు ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చేపట్టనున్న పర్యటనల ఏర్పాట్లను కూడా ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. పర్యటనలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల మధ్య సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. బహిరంగ సమావేశాలు, భద్రత, రవాణా, వసతి, ఇతర లాజిస్టిక్ అవసరాలకు సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.
రాష్ట్రంలోని ప్రతి మండల మహిళా సమాఖ్యకు 1 చొప్పున 553 బస్సులను మంజూరు చేయడం జరిగిందని, ఈ బస్సులను జూన్ 9వ తేదీన సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహిళా సమాఖ్య సభ్యులకు లాంఛనంగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు, సభకు మహిళా సమాఖ్య సభ్యుల తరలింపుపై ఆయా జిల్లాల గ్రామీణ అభివృద్ధి అధికారులు, ఆర్ టి సి రీజినల్ మేనేజర్లు సమన్వయంతో పని చేసి సభను విజయవంతం చేయాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ సీవీ ఆనంద్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానా కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, SERP సీఈఓ దివ్య, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.