నిమ్స్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ ను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

నిమ్స్‌ నూతన డైరెక్టర్‌గా డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ నగరి బీరప్ప ఉద్యోగ కాలం ఈ నెల 6న ముగియడంతో ఆయన స్థానంలో డాక్టర్‌ రాహుల్‌ దేవరాజ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వనపర్తికి చెందిన డాక్టర్‌ రాహుల్‌ దేవ్‌రాజ్‌ గాంధీ మెడికల్‌ కళాశాల నుంచి 1992లో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. 1998లో ఎంఎస్‌ జనరల్‌ సర్జరీ, 2002 లో ఉస్మానియా మెడికల్‌ కాలేజీ నుంచి ఎంసీహెచ్‌, యూరాలజీ పూర్తిచేశారు. పదేండ్లుగా నిమ్స్‌లోని యూరాలజీ విభాగం ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. ఆదివారం పూర్వ డైరెక్టర్‌ డాక్టర్‌ నగరి బీరప్ప నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్‌ శాంతివీర్‌, పలువురు విభాగాధిపతులు, వైద్యులు డాక్టర్‌ రాహుల్‌ దేవ్‌రాజ్‌ను అభినందించారు.