రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను మరింత విస్తృతంగా చేపట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేయడం జరిగింది. సచివాలయంలో రవాణా శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, ఓవర్‌లోడింగ్ చేస్తున్న వాహనాలు, త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు, ఫిట్‌నెస్ లేని వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టాలని సూచించాను. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలను అవసరమైతే సీజ్ చేయాలని ఆదేశించడం జరిగింది. చెక్‌పోస్టులు రద్దు చేసిన సమయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో, ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బందిని మరింత సమర్థవంతంగా వినియోగించి తనిఖీలను పెంచాలని సూచించి,ఈ మేరకు ఉమ్మడి జిల్లాల వారీగా 10 ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు, రాష్ట్ర స్థాయిలో 2 ప్రత్యేక స్క్వాడ్‌లతో తనిఖీలు ముమ్మరం చేయనున్నాం. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశాను. విద్యార్థులను తరలించే స్కూల్ బస్సులు, మినీ వ్యాన్‌లకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి. అనుమతించిన సామర్థ్యానికి మించి విద్యార్థులను తరలిస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించాను. ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు నడుపుతున్న విద్యాసంస్థల యాజమాన్యాలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది.
ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు రాష్ట్రంలో పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించాను. త్రైమాసిక పన్నులు చెల్లించని వాహన యజమానులపై భారీ జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే వాహనాలను సీజ్ చేయాలని పేర్కొనడం జరిగింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా స్లీపర్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశాను. ఉల్లంఘనలు గుర్తించిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. రవాణా వ్యవస్థలో క్రమశిక్షణ, భద్రత, పారదర్శకత పెంపు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజల ప్రాణ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబత్రి, అడిషనల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేష్, జేటీసీ చంద్రశేఖర్ గౌడ్, డీటీసీలు రవీందర్ కుమార్, వెంకట రమణ, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.