వాయు కాలుష్యంతో మూత్రపిండాలకు ముప్పు..

వాషింగ్టన్ : వాయు కాలుష్యం అధికంగా ఉండే భారత్, చైనా తదితర దేశాల ప్రజలకు మూత్రపిండాల వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. జాన్ హాప్కిన్స్ వర్సిటీ చేపట్టిన ఈ పరిశోధన వివరాలను అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ పత్రిక అందించింది. 1996 – 2016 మధ్య నాలుగు నగరాలకు చెందిన 19,997 మంది ఆరోగ్య పరిస్థితిని పరిశోధకులు గమనిస్తూ వచ్చారు. మరోవైపు నెలనెలా ఆయా ప్రాంతాల్లోని వాయు కాలుష్య స్థాయుల్ని… పరిశ్రమలు, శిలాజ ఇంధనాలు, సహజ వనరుల నుంచి విడుదలయ్యే సూక్ష్మ రేణువుల పరిమాణాన్ని విశ్లేషించారు. వాయు కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో… ప్రజల మూత్రపిండాల పనితీరును దెబ్బతీసే అల్బుమిసూరియా స్థాయిలు కూడా ఎక్కువగానే ఉంటున్నట్టు పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. కాలుష్యాన్ని నియంత్రించడం ద్వారా మూత్రపిండాల వ్యాధుల బారిన పడకుండా కొంతవరకైనా ప్రజలను కాపాడవచ్చని పరిశోధనకర్త మాథ్యూ ఎఫ్ బ్లమ్ పేర్కొన్నారు.