వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో R&B అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • వాగులు వంకలు పొర్లి ప్రమాదాలకు ఆస్కారం ఉన్న రోడ్లను, బ్రిడ్జిలను గుర్తించి ప్రమాద హెచ్చరికలు పెట్టాలి
  • ప్రతి రోజు అధికారులు ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే..
  • ఆర్ అండ్ బి అధికారుల సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • పురోగతిలో ఉన్న పలు రోడ్లు, ఆర్వోబి,ఆర్యుబి లపై ఆరా తీసిన మంత్రి
  • రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణలో రాష్ట్ర వాటా కింద 626.87 కోట్లు ఇప్పటికే NHAI ఖాతాలో జమచేసినట్లు వెల్లడి
  • నందిపాడ్ వెహికల్ అండర్ పాస్ నిర్మాణంపై అధికారులను ఆదేశించిన మంత్రి

హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆర్ అండ్ బి అధికారులు క్షేత్ర స్థాయిలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. వాగులు వంకలు పొర్లి ప్రమాదాలకు ఆస్కారం ఉన్న రోడ్లను,బ్రిడ్జిలను గుర్తించి ప్రమాద హెచ్చరికలు పెట్టాలనీ,అందుకు అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు,లో కాజ్ వేలు వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ఏడాది వానకాలం సీజన్ లో క్షేత్ర స్థాయిలో మానిటరింగ్ చేస్తూ అప్రమత్తంగా ఉన్నట్లే..ఎర్రమంజిల్ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ సెంటర్ ఏర్పాటు చేసుకుని,జిల్లాల వారీగా రోజు వారి పరిస్థితులు పర్యవేక్షించాలని చెప్పారు. ఆర్ అండ్ బి డివిజన్ ల వారిగా క్షేత్ర స్థాయి రిపోర్ట్ రోజు తనకు తెలపాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు సి.ఈ, ఎస్.ఈ, ఈ.ఈ, డి.ఈ, ఏ.ఈ లు ఖచ్చితంగా ప్రతి రోజు ఫీల్డ్ విజిట్ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. పురోగతిలో ఉన్న పలు రోడ్లు, ఆర్వోబి,ఆర్యుబి లపై ఆరా తీసిన మంత్రి,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నవాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి: రాష్ట్రంలో రోడ్ నెట్వర్క్ అభివృద్ధి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి ఈ సందర్భంగా అధికారులతో పేర్కొన్నారు. హ్యామ్ పనులకు అతి త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన ఉంటుందని మంత్రి అన్నారు. 2047 రైసింగ్ తెలంగాణ నినాదంతో 3ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్ర రోడ్ సెక్టార్ పాలసీ తీసుకువచ్చామని గుర్తు చేశారు. గ్రామీణ స్థాయి నుండి రహదారులు అభివృద్ది చేయడం వల్ల పరిశ్రమలు వచ్చి, పల్లెల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.

రీజినల్ రింగ్ రోడ్డు పనుల పురోగతిపై ఆరా తీసిన మంత్రి
రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు రాష్ట్రానికి గేమ్ చేంజర్ గా మారనుందని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,తాను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీనీ కలిసి ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల RRR సదరన్ పార్ట్ పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రాసిన లేఖపై సమీక్షలో ప్రస్తావనకు వచ్చింది. కేంద్రం నుండి వెంటనే సదరన్ పార్ట్ పై అప్రూవల్ వచ్చేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని,ఇక్కడి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్,రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం భూసేకరణలో రాష్ట్ర వాటా కింద 626.87 కోట్లు ఇప్పటికే NHAI ఖాతాలో జమచేసినట్లు వెల్లడించారు. హై స్పీడ్ రైల్ కారిడాల్ (హైదరాబాద్ – పూణే – ముంబై,భారత్ ఫ్యూచర్ సిటీ – చెన్నై,ఫ్యూచర్ సిటీ – బెంగళూరు) పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా చర్చిస్తానని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.

ఎయిర్పోర్ట్ ల పనుల పురోగతిపై ఆరా..
వరంగల్ ఎయిర్పోర్ట్,ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని రూరల్ ఎకానమీ గ్రోత్ కి ఎంతో ఉపయుక్తం కానున్నాయని మంత్రి అభిప్రాయ పడ్డారు. వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని వచ్చే ఏడాది నాటికి కార్గో సేవలు అందుబాటులోకి వచ్చేలా పనులు చేస్తున్నట్లు తెలిపారు.

నందిపాడ్ వెహికల్ అండర్ పాస్ నిర్మాణం పై…
న్యామ్ రోడ్డులో మిర్యాలగూడ నియోజకవర్గంలోని నందిపాడ్ వద్ద తరచూ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని,వెంటనే అక్కడ వెహికిల్ అండర్ పాస్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పరిపాలన అనుమతులు మంజూరు చేసి, పనులు అతి త్వరగా ప్రారంభం అయ్యేలా చూడాలని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, సెక్రెటరీ ప్రావిణ్య,సి.ఈ లు బి.వి రావు,ధర్మారెడ్డి, వనజ పలువురు ఆర్ అండ్ బి ఇంజనీర్లు ఉన్నారు.