రూ.200 కోట్లు పోగేసిన (ENC మోహన్ నాయక్) అవినీతి అనకొండ..

  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో.. మోహన్‌నాయక్‌, ఆయన మిత్రులు, బంధువుల నివాసాల్లో ఏసీబీ సోదాలు
  • కిలోన్నర బంగారం బిస్కట్లు, మరో కిలో ఆభరణాలు
  • బ్యాంకులో రూ.1.44 కోట్లు.. ఇంట్లో రూ.55 లక్షలు నగదు
  • 5 చోట్ల 19.38 ఎకరాల భూమి.. 7 లగ్జరీ ఫ్లాట్లు.. ఖరీదైన విల్లా
  • గృహోపకరణాల విలువే రూ.1.26 కోట్లు
  • ఇంట్లో మినీ బార్‌.. విదేశీ మద్యం బాటిళ్లు
  • కొనసాగుతున్న తనిఖీలు.. ఈఎన్‌సీ మోహన్‌నాయక్‌ అరెస్టు
  • బినామీ ఆస్తులు, లాకర్లు ఇతర అంశాలపై విచారణ జరుపుతున్నాం: ఏసీబీ డీజీ చారుసిన్హా
  • లంచం అడిగితే టోల్‌ ఫ్రీ నంబర్‌1064కు, ఫిర్యాదు చేయాలి: డీజీ చారుసిన్హా

రహదారులు, భవనాల శాఖలో భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఆర్‌అండ్‌బీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) మోహన్‌నాయక్‌, ఆయన బంధువుల నివాసాలపై దాడులు చేసిన ఏసీబీ అధికారులు.. ఏకంగా రూ.200 కోట్ల ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. మోహన్‌ నాయక్‌ను అరెస్టు చేశారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని, బినామీ ఆస్తులు, లాకర్లు ఇతర అంశాలపై విచారణ జరుపుతున్నామని ఏసీబీ డీజీ చారుసిన్హా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా మోహన్‌నాయక్‌, ఆయన మిత్రులు, బంధువుల నివాసాల్లో ఏకకాలంలో 15 చోట్ల ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తనిఖీల్లో బయటపడ్డ నగదు, బంగారాన్ని, కోటికిపైగా విలువైన గృహోపకరణాలను, ఆస్తుల పత్రాలను చూసి నివ్వెరబోయారు. మోహన్‌ నాయక్‌ ఇంట్లో రూ.55 లక్షల నగదు, 15 బంగారు బిస్కట్లు సహా రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు, రూ.3,60,000 విలువైన ఆరు కిలోల వెండి వస్తువులు, రూ.1.26 కోట్ల విలువైన గృహోపకరణాలు, రూ.11,25,000 విలువైన మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టా్‌పలు, రూ.25 లక్షల విలువైన రెండు కార్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం ముల్లంగి గ్రామంలో ఐదు చోట్ల 19.38 ఎకరాల భూమి. హైదరాబాద్‌లోని కొంపల్లిలో మూడు, గచ్చిబౌలిలో 4 ఖరీదైన ఫ్లాట్లు (డాక్యుమెంట్ల విలువ రూ.7,34,73,867), మియాపూర్‌లో రూ.2.50 కోట్ల విలువైన ట్రిప్లెక్స్‌ విల్లా, కూకట్‌పల్లిలో రూ.62,14,000తో నిర్మించిన కొత్త ఇల్లు, నిజామాబాద్‌లో కొత్తగా నిర్మించిన విల్లాకు రూ.1కోటి అడ్వాన్స్‌గా ఇచ్చిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మోహన్‌నాయక్‌ బ్యాంకు ఖాతాలో రూ.1.44 కోట్లు ఉన్నాయని.. కొన్నేళ్లుగా ఆయన బ్యాంకు ఖాతాలో పడిన జీతాన్ని ఖర్చు చేయలేదని అధికారులు పేర్కొన్నారు. ఆయన ఇంట్లోనే మినీ బార్‌ ఏర్పాటు చేసుకున్నారని, పదుల సంఖ్యలో విదేశీ మద్యం బాటిళ్లు ఉన్నాయని తెలిపారు. మోహన్‌నాయక్‌ ఆస్తుల డాక్యుమెంట్ల విలువ రూ.17,94,62,617గా ఉన్నప్పటికీ బహిరంగ మార్కెట్‌ విలువ అంతకు చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.

మోహన్‌ నాయక్‌ అవినీతి నిరోధక చట్టం-1988 (2018 సవరణ)లోని సెక్షన్‌ 13(1)(బీ) రెడ్‌ విత్‌ 13(2) కింద కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఎస్‌పీఈ అండ్‌ ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి, 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఇంకా అదనపు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అనే విషయమై తనిఖీలు కొనసాగుతాయని, బినామీలు, బంధువులు గురించి లోతుగా అధ్యయనం చేస్తామని అధికారులు చెప్పారు. ఎవరైనా లంచం అడిగితే టోల్‌ ఫ్రీ నంబర్‌1064కు, ఫిర్యాదు చేయాలని డీజీ చారుసిన్హా కోరారు.

  • మోహన్‌నాయక్‌ ఆస్తుల వివరాలివే..
  • నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం ముల్లంగిలో 19.38 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు.. ప్రభుత్వ విలువ రూ.82లక్షలు
  • ఏడు విలాసవంతమైన ఫ్లాట్లు (కొంపల్లిలో 3, గచ్చిబౌలిలో4). వీటి డాక్యుమెంట్‌ విలువ రూ.7,34,73,867
  • హైదరాబాద్‌ మియాపూర్‌లో ఒక విలాసవంతమైన ట్రిప్లెక్స్‌ విల్లా, సుమారు రూ.2,50,00,000
  • కూకట్‌పల్లిలో కొత్తగా నిర్మించిన ఒక ఇల్లు, విలువ దాదాపు రూ.62,14,000
  • నిజామాబాద్‌లో కొత్త విల్లా కొనుగోలు కోసం రూ.కోటి అడ్వాన్స్‌ ఇచ్చిన పత్రం.
  • సోదాల్లో పట్టుబడిన నగదు విలువ రూ.55లక్షలు
  • బ్యాంక్‌ ఖాతాల్లో నిల్వ ఉన్న నగదు రూ.1,44కోట్లు
  • సుమారు 2.5 కిలోలు బంగారు ఆభరణాలు, విలువ దాదాపు రూ.2కోట్లు
  • సుమారు 6 కిలోలు వెండి వస్తువులు, విలువ రూ.3,60,000
  •  ఇండ్లలో ఉన్న విలాసవంతమైన గృహోపకరణాల విలువ రూ.1,26,00,000
  •  9 ఖరీదైన మొబైల్‌ ఫోన్లు, 4 లాప్‌టాప్‌లు స్వాధీనం, వీటి విలువ రూ.11,25,000
  • సీజ్‌ చేసిన రెండు వాహనాల విలువ రూ.25లక్షలు