ఆరోగ్యశాఖలో విజయవంతంగా ముగిసిన బదిలీల ప్రక్రియ

రాష్ట్ర ఆరోగ్యశాఖలో భారీ స్థాయిలో చేపట్టిన బదిలీల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా, ప్రభుత్వ వైద్య సంస్థల్లో మానవ వనరుల సమతుల్యతను కాపాడుతూ ప్రభుత్వం 157 కేడర్లలో మొత్తం 4,869 మంది ఉద్యోగులను బదిలీ చేసింది. ఈ బదిలీల్లో అత్యధికంగా పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ పరిధిలో 2,258 మంది ఉద్యోగులు బదిలీ అయ్యారు. అలాగే వైద్య ఆరోగ్యశాఖలోని వివిధ విభాగాలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటళ్లలో అవసరాలకు అనుగుణంగా డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని పునర్వ్యవస్థీకరించారు. త్వరలో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనుబంధ టీచింగ్ హాస్పిటళ్లలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తనిఖీలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ప్రభుత్వం బదిలీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఎన్‌ఎంసీ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి మెడికల్ కాలేజీలో అవసరమైన సంఖ్యలో అధ్యాపకులు, వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా బదిలీలను నిర్వహించింది.

అదే సమయంలో ఒకే హాస్పిటల్ నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఒకేసారి బదిలీ చేస్తే రోగులకు అందే సేవలపై ప్రభావం పడే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో వైద్య సేవలకు ఆటంకం కలగకుండా బదిలీల ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా అమలు చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ఒకే స్టేషన్‌లో నాలుగు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన ఉద్యోగులకు మాత్రమే బదిలీకి అవకాశం కల్పించింది. నాలుగు సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులకు బదిలీల అవకాశం కల్పిస్తే జిల్లాల్లోని ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ విషయంలో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల స్థాయిలోనే నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను, జిల్లా కేంద్రాల్లోని టీచింగ్ హాస్పిటళ్లను బలోపేతం చేస్తోంది. ప్రజలకు అవసరమైన వైద్య సేవల్లో దాదాపు 90 శాతం సేవలను జిల్లా స్థాయిలోనే అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో మౌలిక సదుపాయాలు, మానవ వనరులను పెంచుతోంది.

ఇదే వ్యూహంలో భాగంగా ఇటీవల నియామకాలు పొందుతున్న డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బందికి కూడా గ్రామీణ మరియు జిల్లా స్థాయి వైద్య సంస్థల్లోనే పోస్టింగ్‌లు ఇస్తోంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది కొరత తగ్గడంతో పాటు ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్, వరంగల్ వంటి పట్టణాల్లోని ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చి ట్రీట్‌మెంట్ తీసుకునే పేషెంట్లకు రవాణా, ఇతర ఖర్చుల భారం ఉంటోంది. ఈ నేపథ్యంలో జిల్లాల్లోనే అవసరమైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది. బదిలీల ప్రక్రియను పారదర్శకంగా, వైద్య సేవల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్వహించడం ద్వారా రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసిందని ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. బదిలీల్లో దీర్ఘకాలం హైదరాబాద్ వంటి ఒకే స్టేషన్‌లో పనిచేసిన వారిని బదిలీ చేయడంతో.. జిల్లాల్లో సుదీర్ఘకాలం పని చేసిన డాక్టర్లు, సిబ్బందికి హైదరాబాద్‌కు వచ్చే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో వారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో పేషెంట్లకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని డాక్టర్లు చెబుతున్నారు.