- ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంటిపై ఏసీబీ రెయిడ్స్
- ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రత్యేక బృందాల తనిఖీలు
- హైదరాబాద్ తో పాటు 11 ప్రాంతాల్లో ఈ సోదాలు
- సోదాల్లో రూ.200 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు!
- నరహరి అక్రమ సంపాదనకు సంబంధించి ఏసీబీకి అనేక ఫిర్యాదులు
తెలంగాణలో మరో భారీ అవినీతి తిమింగలం అవినీతి నిరోధక శాఖ(ACB)కి చిక్కింది. ఇటీవలే ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై R&B ENC మోహన్ నాయక్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. తాజాగా ఇవాళ ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సరహరి ఇల్లు, కార్యాలయాలు, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో హైదరాబాద్ లోని పాతబస్తీ ఛత్రినాక, నారాయణగూడలోని సర్వే భవన్, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ ఆఫీసుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచీ సోదాలు చేస్తోన్న అధికారులకు షాక్ కు గురిచేసేలా కిలోల్లో బంగారం.. వెండి.. ఇంటి నిండా నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఇప్పటి వరకూ నిర్వహించిన సోదాల్లో రూ.200 కోట్ల అక్రమాస్తులు గుర్తించినట్లు సమాచారం. కీలకమైన భూమి పత్రాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. బెడ్ రూంలో బెడ్ కింద రూ.1.10 కోట్ల విలువైన నోట్ల కట్టలు, బీరువాల్లో భారీగా బంగారం, వెండి ఆభరణాలను గుర్తించారు. సంచుల్లో నోట్ల కట్టలు నింపి సజ్జపై దాచి ఉంచిన డబ్బు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఛత్రినాక నివాసంలో ఖాళీ బాండ్ పేపర్లు, చెక్కులను సీజ్ చేశారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు రెయిడ్స్ కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని మొత్తం 11 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. నరహరి అక్రమ సంపాదనకు సంబంధించి గతంలోనే ఏసీబీకి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో పక్కా ప్లాన్ తో ఆధారాలు సేకరించిన ఏసీబీ.. ఇవాళ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.