- జలాశయాల పూర్వ నిల్వ సామర్థ్య పునరుద్ధరణకు చర్యలు
- దేశంలోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలి
- అనువైన పద్దతిని తెలంగాణకు అన్వయించాలి
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు, జలాశయాల్లో పూడిక తొలగింపు (డీసిల్టేషన్) కోసం తక్షణ అవసరాలను తీర్చడమే కాకుండా, దీర్ఘకాలిక వరద నియంత్రణ అవసరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఆచరణాత్మక, స్థిరమైన శాస్త్రీయ నమూనాను రూపొందించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో జలాశయాలు, నీటిపారుదల ప్రాజెక్టులలో పూడిక తొలగింపు కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి, గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రధాన జలాశయాల అసలు నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్ ,గనుల శాఖా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, నీటిపారుదల శాఖా సహాయ కార్యదర్శి కే. శ్రీనివాస్, ఇ. ఎన్.సి ఓ. రమేశ్ బాబు తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జలాశయాల నిల్వ సామర్థ్యం పెరగడం వల్ల నీటి భద్రత మెరుగుపడటంతో పాటు సాగునీటి విస్తీర్ణం పెరుగుతుందని, వరద ముప్పు కూడా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పూడిక తొలగింపు నమూనాలను సమగ్రంగా అధ్యయనం చేసి తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయగల ఉత్తమ విధానాలను గుర్తించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అంతే గాకుండా జలాశయాల్లో పూడిక నిర్వహణ, పూడిక తొలగింపుపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ మార్గదర్శకాలు, విధానాలను కూడా అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. ఇతర రాష్ట్రాల అనుభవాలను ప్రస్తావిస్తూ, పూడిక తొలగింపు వంటి నివారణ చర్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. గత ఏడాది పంజాబ్ రాష్ట్రంలో సంభవించిన తీవ్ర వరదల కారణంగా 22 జిల్లాల్లో 16 జిల్లాలు ముంపుకు గురయ్యాయని, నష్టపరిహారం మరియు పునరుద్ధరణ చర్యల కోసం దాదాపు రూ.2,000 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. సకాలంలో పూడిక తొలగింపు, డ్రైనేజీ వ్యవస్థలు మరియు జలాశయాల నిల్వ సామర్థ్యాల పునరుద్ధరణ వంటి చర్యలు చేపట్టినట్లయితే ఆ వ్యయంలో గణనీయమైన భాగాన్ని నివారించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలోని మంగళం ఆనకట్టలో 2017లో చేపట్టిన పూడిక తొలగింపు కార్యక్రమాన్ని విజయవంతమైన నమూనాగా మంత్రి ప్రస్తావించారు. శాస్త్రీయ పద్ధతిలో చేపట్టిన ఆ కార్యక్రమం ద్వారా జలాశయంలో పేరుకుపోయిన పూడిక సమస్యను పరిష్కరించడమే కాకుండా, తవ్వి తీసిన మట్టిని వినియోగించడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా సాధించారని తెలిపారు. అలాంటి విజయవంతమైన నమూనాలను అధ్యయనం చేసి తెలంగాణలో అమలు చేయగల మార్గాలను పరిశీలించాలని ఆయన సూచించారు. కడెం ప్రాజెక్టులో పూడిక తొలగింపు పనులు చేపడుతున్న సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి సమీక్షించారు. అలాగే లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ), మిడ్ మానేరు రిజర్వాయర్ (ఎంఎంఆర్)లలో జరుగుతున్న పూడిక తొలగింపు పనుల పురోగతిని కూడా పరిశీలించారు. పనుల వేగాన్ని పెంచేందుకు, కార్యాచరణలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు ఆచరణాత్మక పరిష్కారాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ), నిజాంసాగర్ ప్రాజెక్టుల ప్రధాన ఇంజినీర్లు ఆయా ప్రాజెక్టుల్లో పూడిక పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసి, కోల్పోయిన నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు చేపట్టగల చర్యలపై నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు. జలాశయాల నిర్వహణలో శాస్త్రీయ, దీర్ఘకాలిక దృక్పథాన్ని అవలంబించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. వరద నియంత్రణ, నీటి సంరక్షణ, సాగునీటి స్థిరత్వం సాధనలో పూడిక తొలగింపును కీలక అంశంగా పరిగణిస్తూ ముందుకు సాగుతామని తెలిపారు. రాష్ట్రంలోని జలాశయాల్లో పూడిక తొలగింపు కార్యక్రమానికి ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఆపరేషన్ & మెయింటెనెన్స్) నేతృత్వం వహిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.