పేదలు సన్న బియ్యం తినాలి: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

  • రైతులు ఆర్థికంగా ఎదగాలి
  • రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ సంకల్పం
  • లాభదాయక వ్యవసాయం వైపు తెలంగాణ అడుగులు

రైతాంగాన్ని అదుకునేందుకు ప్ర‌జాప్ర‌భుత్వం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంద‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో జరిగిన కేబినెట్ స‌బ్ క‌మిటీలో చెప్పారు. జాతీయంగా, అంత‌ర్జాతీయంగా డిమాండ్ ఉన్న మేలు రకాల సాగుకు రైతులను ప్రోత్సహించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. పేదలు కూడా సన్న బియ్యం తినాలి.. రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి అనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళుతోంద‌ని ఆయ‌న అన్నారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన స‌చివాల‌యంలో జ‌రిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు హాజరయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు, నిల్వ సదుపాయాలు, వానకాలం సాగు పై కేబినెట్ సబ్ కమిటి చ‌ర్చింది. ఈ సంద‌ర్భంగా రైతులకు లాభ‌దాయ‌క‌మైన BPT 5204, తెలంగాణ సోనా (RNR 15048), KNM-1638, జై శ్రీరామ్, హెచ్ఎంటీ రకాల వంగడాలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని రైతు క‌మిష‌న్ ప్ర‌భుత్వానికి సిఫార‌సు చేసింది. ఆయా పంట‌ల‌కు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉండ‌డం వ‌ల్ల రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని అన్నారు.

మేలుజాతి వంగ‌డాలు స‌మృద్ధిగా ఉన్నాయని.. కాబ‌ట్టి వీటిని సాగు చేస్తే రైతుల‌కు ఆదాయం గ‌ణ‌నీయంగా ఉంటుద‌ని వ్య‌వ‌సాయ క‌మిష‌న్ తెలిపింది. ప్రభుత్వం ఈ వంగడాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, గ్రామ గ్రామాన రైతులను చైతన్యపరచడానికి ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని క‌మిష‌న్ తెలిపింది. రాబోయే సీజన్లలో ఈ రకాలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా అటు రైతులకు అదనపు ఆదాయం, ఇటు మార్కెట్ రంగానికి పూర్తి ప్రయోజనం చేకూరుతుందని, వరి సాగులో తెలంగాణ రాష్ట్రం మరింత లాభదాయకమైన దిశగా అడుగులు వేస్తుందని వ్యవసాయ క‌మిష‌న్ సైతం కేబినెట్ సబ్ కమిటీకి నివేదించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. కొనుగోళ్ళకు తగ్గిస్తూ మనల్ని ఇబ్బంది పెడుతోందని వ్య‌వ‌సాయ క‌మీష‌న్ తెలిపింది. అంతేకాక బాయిల్డ్ రైస్ ను ఏమాత్రం కొనుగోలు చేయడం లేదని స్ప‌ష్టం చేసింది. రాష్ట్ర రైతాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంద‌ని తెలిపింది. ఈ సమావేశంలో రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి, సీడ్ కార్పోరేషన్ చైర్మెన్ అన్వేష్ రెడ్డి, సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జాతీయ మిల్ల‌ర్ల సంఘం అధ్య‌క్షుడు దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.