ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అంకితం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • ప్రతి నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు లక్ష్యం.
  • తెలంగాణను విద్యారంగంలో దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలతో మాట్లాడినా తరువాత విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ప్రీ-ప్రైమరీ విభాగాలను, పాఠశాల లైబ్రరీ, తరగతి గదులు, ఇన్నోవేషన్ ల్యాబ్, ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ ల్యాబ్స్‌ ను సందర్శించి సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆవరణలో మొక్క నాటిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డాన్స్, మ్యూజిక్ రూమ్ ను సందర్శించారు. ఫుట్ బాల్ గ్రౌండ్ ను సందర్శించి విద్యార్థులతో కాసేపుజ్ ఫుట్ బాల్ ఆడిన సీఎం. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, ఆరుట్లలో ప్రారంభమైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ కేవలం ఒక గ్రామానికే పరిమితం కాదని, తెలంగాణ రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అంకితమని పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్ అద్దాల మేడల్లోనో, రంగుల గోడల్లోనో లేదని, తరగతి గదుల్లోనే ఉందనే సంపూర్ణ విశ్వాసంతో ప్రభుత్వం విద్యా రంగంలో సంస్కరణలు చేపడుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యా కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో ఇప్పటికే 1,814 మంది విద్యార్థులు చేరడం సంతోషకరమని, ఒక ప్రభుత్వ పాఠశాలకు ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి రావడం ప్రభుత్వ విద్యపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి అభినందించారు.

రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. మట్టిలోని మాణిక్యాలను వెలికితీయడానికి ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారే ఎన్నో ఉన్నత స్థానాలకు చేరుకున్నారని గుర్తు చేశారు. మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు ప్రభుత్వ పాఠశాలలో చదివారని, తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ముఖ్యమంత్రి స్థాయికి చేరానని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యలో రాణించి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులుగా ఎదిగి తమ తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో జీవించేలా చేయాలని పిలుపునిచ్చారు. విధ్వంసమైన విద్యావ్యవస్థను వికాసం వైపు నడిపించేందుకే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఆరుట్ల గ్రామం తెలంగాణకు ఆదర్శంగా నిలుస్తుందని తాను విశ్వసిస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫారాలు, కిట్లను అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోందని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, క్రీడల్లో ప్రత్యేక శిక్షణ అందించే కార్యక్రమాలను చేపట్టామని పేర్కొన్నారు. డిసెంబర్ 9న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవనాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి క్రీడా శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో విద్యార్థులు ఫుట్‌బాల్ ఆడే అవకాశాన్ని కల్పించామని, క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అనవసర రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. విమర్శించే వారికి ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను చూపించాలని, ప్రజలు అండగా నిలిస్తే అద్భుతాలు సృష్టించి తెలంగాణను దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ విద్యా కమిషన్ చైర్‌పర్సన్ ఆకునూరి మురళి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రా రెడ్డి, కిరణ్మయి,ఉన్నతాధికారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.