ఎన్నికల అధికారితో చర్చించి తెలంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్పీఎస్-2021కు సంబంధించిన 11 శాతం ఫిట్మెంట్ను జూలై 1 నుంచి అమలు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సమ్మె సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఉద్యోగి శంకర్ కుటుంబానికి ఉద్యోగుల నుంచి సేకరించిన నిధులతో త్వరలో రూ.కోటి చెక్కు అందజేయడంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు పూర్తయిన సందర్భంగా ఆర్టీసీ పురోగతి, భవిష్యత్తు కార్యాచరణపై పొన్నం సచివాలయంలో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎలక్ర్టిక్ బస్సుల విస్తరణపై దక్షిణాది రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు, ఆర్టీసీ ఎండీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.