ఎస్ఐఆర్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి: సిఇఒ సి. సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్ : అర్హులైన ప్రతి ఓటరు పేరును ఓటరు జాబితాతో నమోదు చేయాలని, అనర్హులైన వారి పేర్లను జాబితా తొలగించాలని ఉద్దేశ్యంతోనే భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ) సి. సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై శనివారం బిఆర్ కె భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిఇఓ సదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 25.06.2026 నుండి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి గణన ఫారమ్స్ (Enumeration Forms) ను పంపిణీ చేసే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. గణన ఫారమ్స్ పంపిణీ కార్యక్రమాం నెల రోజుల (25.06.2026 నుండి 24.07.2026 వరకు) పాటు కొనసాగనున్నదని, ఈ గడువు పొడిగింపు ఉండదని తెలిపారు. ఇంటింటికీ బిఎల్ఒలు ఓటర్లకు గణన ఫారమ్ లను పూరించడంలో సహాయం చేస్తారని, ఇందుకోసం వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. బిఎల్ఒలు ప్రతి ఇంటిని కనీసం మూడుసార్లు సందర్శిస్తారని, ఆ సమయంలో ఫారమ్ లను పంపిణీ చేయడంతో పాటు, ఓటర్లు పూరించిన ఫారమ్ లను కూడా సేకరిస్తారని, ఎస్ఐఆర్ ప్రక్రియలో బిఎల్ఒలు కీలక పాత్ర పోషిస్తారని, అలాగే బూత్ స్థాయి ఏజెంట్లు (BLAలు) కూడా సంబంధిత పోలింగ్ కేంద్రాల పరిధిలో గణన ఫారమ్‌లను పూరించడంలో BLOలకు సహకరించేందుకు తగిన శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ఓటర్లు తమ గణన ఫారమ్‌లను ఆన్‌లైన్ ద్వారా voters.eci.gov.in వెబ్‌సైట్‌లో కూడా సమర్పించవచ్చని చెప్పారు.ప్రత్యేక ఓటరు జాబితా సవరణ-2026 కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. గణన ఫారమ్‌ల పంపిణీ, సేకరణ కోసం BLOలు ఇంటింటికీ వచ్చినప్పుడు ఓటర్లందరూ SIR ప్రక్రియకు సహకరించాలని CEO విజ్ఞప్తి చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డా. వాసం వెంకటేశ్వర్ రెడ్డి, ఐఏఎస్, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి శ్రీమతి ఎం. సత్యవాణి, ఐఏఎస్, ప్రభుత్వ అదనపు కార్యదర్శి శ్రీ శంకర్, సహాయ కార్యదర్శి శ్రీ ఎ.ఎస్. చారి, శ్రీ బి. చెన్నయ్య (SGDC) మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.