- ప్రతి టన్ను బొగ్గుపై పటిష్ట పర్యవేక్షణ
- అత్యాధునిక సాంకేతికతతో పారదర్శక రవాణా వ్యవస్థ
- సింగరేణి యాజమాన్యం స్పష్టీకరణ
- సింగరేణి భవన్, జూన్ 21, 2026
సింగరేణి బొగ్గు చోరీకి గురైందని, కనిపించడం లేదంటూ కొన్ని మీడియా సంస్థల్లో ఇటీవల వస్తున్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ స్పష్టం చేస్తోంది. సంస్థలో బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, రవాణా, విక్రయాలకు సంబంధించిన అన్ని ప్రక్రియలు అత్యంత పారదర్శకంగా, ఆధునిక సాంకేతిక వ్యవస్థల పర్యవేక్షణలో జరుగుతున్నాయని పేర్కొంది. సింగరేణిలో అమలులో ఉన్న బొగ్గు రవాణా, భద్రతా వ్యవస్థలు, సాంకేతిక పర్యవేక్షణ విధానాలను వెల్లడించింది. “గనుల్లో బొగ్గు ఉత్పత్తి అయిన క్షణం నుంచి వినియోగదారుడి వద్దకు చేరే వరకు ప్రతి దశ డిజిటల్‌గా నమోదవుతోంది. బొగ్గులో సుమారు 85 శాతం రైల్వే మార్గం ద్వారా, మిగిలిన 15 శాతం రోడ్డు మార్గం ద్వారా సరఫరా చేయడం జరుగుతోంది. బొగ్గు కేటాయింపులు SAP ఆధారిత సమగ్ర వ్యవస్థ ద్వారా జరుగుతున్నాయి. వినియోగదారుడు, గని, పరిమాణం, సరఫరా తేదీ తదితర వివరాలు ముందుగానే డిజిటల్‌గా నమోదవుతాయి. ప్రతి టన్ను బొగ్గుకు సంబంధించిన సమాచారం Coal Net, SAP మరియు ఇతర ఆన్లైన్ వ్యవస్థల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని” సింగరేణి ఆపరేషన్స్ విభాగం ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. “రోడ్డు మార్గంలో బొగ్గు రవాణా చేసే ప్రతి వాహనం ఎలక్ట్రానిక్ వెయిబ్రిడ్జ్‌ల వద్ద తూకం వేయడం జరుగుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్( RFID) ఆధారిత బూమ్ బ్యారియర్లు, జీపీఎస్ / జీపీఆర్ఎస్ (GPS/GPRS) ట్రాకింగ్, జియోఫెన్సింగ్ వ్యవస్థల ద్వారా వాహనాల కదలికలపై రియల్ టైమ్ లో పర్యవేక్షణ కొనసాగుతోందని” ప్లానింగ్ విభాగం ఉన్నతాధికారులు పేర్కొన్నారు. “రైల్వే మార్గంలో కూడా ప్రతి వ్యాగన్ లోడింగ్, డిస్పాచ్ వివరాలు డిజిటల్‌గా నమోదవుతున్నాయి. గనులు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లు( CHP)లు, వెయిబ్రిడ్జ్ లు, రైల్వే సైడింగ్‌లు, స్టాక్ యార్డులు, ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు, RFID వ్యవస్థలు, చెక్‌పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, భద్రతా సిబ్బంది 24 గంటలూ పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు” బొగ్గు రవాణా విభాగం ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అలాగే ఆకస్మిక తనిఖీలు, ప్రత్యేక గస్తీలు నిరంతరం కొనసాగుతున్నాయన్నారు. ఇంత పకడ్బందీగా RFID, GPS, CCTV, Coal Net, ఎలక్ట్రానిక్ వెయిబ్రిడ్జ్‌లు, సింగరేణి సెక్యూరిటీ, ఫ్లయింగ్ స్క్వాడ్లు, హోలోగ్రామ్ చలానాలు, టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షణ వంటి బహుళస్థాయి భద్రతా వ్యవస్థల మధ్య జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి-రవాణా ప్రక్రియలో బొగ్గు చోరీకి గురికావడం, కనిపించకపోవడం వంటి ఆరోపణలు అవాస్తవమని సింగరేణి యాజమాన్యం పేర్కొంది.