కాలుష్యాన్ని వెదజల్లుతున్న బ్లూక్రాన్ కంపెనీపై చర్యలు తీసుకోవాలి

  • బ్లూ క్రాఫ్ కెమికల్ పరిశ్రమ ముందు గ్రామ ప్రజలు ధర్నా
  • పీసీబీ అధికారుల క్లోజర్ ఆర్డర్ ను సైతం లెక్కచేయని పరిశ్రమ
  • మరోవైపు దోమడుగు చెరువు కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ, TPJAC
  • కాలుష్య నియంత్రణపై మొద్దునిద్రలో PCB అధికారులు

ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న బ్లూక్రాన్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నందికండి గ్రామ సర్పంచ్ మాచర్ల సరస్వతి విజయ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు సోమవారం కంపెనీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సరస్వతి విజయ్ మాట్లాడుతూ.. దాదాపు 20 ఏళ్ల క్రితం స్థాపించబడిన ఈ కంపెనీ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకున్నప్పటికీ, కాలుష్య నివారణ చర్యలు చేపట్టడంలో, కార్మికుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత కొంతకాలంగా రాత్రి వేళల్లో కంపెనీ నుంచి విడుదలవుతున్న పొగకారణంగా గ్రామంలోని ఇళ్లపై సన్నటి బూడిద పేరుకుపోతుందని, అది గాలిలో కలసి ఆహార పదార్థాలు, తాగునీటిలో చేరి ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఏప్రిల్ మొదటి వారంలో గ్రామపంచాయతీ తరఫున తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పీసీబీ అధికారులు 15 రోజుల క్రితం కంపెనీకి క్లోజింగ్ ఆర్డర్లు జారీ చేసినప్పటికీ, వాటిని పట్టించుకోకుండా కంపెనీ యథావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తూ కాలుష్యాన్ని వెదజల్లుతోందని గ్రామస్తులు ఆరోపించారు. కంపెనీ విడుదల చేస్తున్న వ్యర్థ జలాల వల్ల భూగర్భజలాలు కలుషితమవుతున్నాయని, గ్రామంలోని బోరుబావుల్లో కూడా కలుషితనీరు వస్తోందని గ్రామస్తులు వాపోయారు. రాత్రివేళల్లో విడుదల చేస్తున్నపొగకారణంగా తీవ్ర దుర్వాసన వస్తోందని, పలువురు అస్వస్థతకు గురవుతున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్న కంపెనీపై ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో గ్రామస్తులంతా కలిసి పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కాలుష్య నియంత్రణలో PCB అధికారులు తమకు ఏమి పట్టనట్లు మొద్దునిద్రలో ఉన్నారు అని గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న సదాశివపేట సీఐ వెంకటేశం సంఘటన స్థలానికి చేరుకుని శాంతిభద్రతలను పర్యవేక్షించి గ్రామస్తులను శాంతింపజేశారు. ఉప సర్పంచ్ ఆకుల శివరాం, వార్డు సభ్యులు లక్ష్మణ్, వీరేశం, రామకృష్ణ రాజు, సంగయ్యతో పాటు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.

మరోవైపు దోమడుగు చెరువు కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ, TPJAC
పారిశ్రామిక వ్యర్థాలతో తీవ్రంగా కలుషితమైన దోమడుగు నల్లకుంట చెరువును శాస్త్రీయంగా శుద్దిచేయకుండా, సుందీరకరణ పేరుతో కాలుష్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని దోమడుగు కాలుష్య వ్యతిరేక పోరాట కమిటీ, తెలంగాణ పీపుల్స్ జేఏసీ (టీపీజేఏసీ) నాయకులు ఆరోపించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. గతంలో చెరువు నీరు రంగు మారిన నేపథ్యంలో పీసీబీ అధికారుల జోక్యంతో కంపెనీ ఖర్చుతో కలుషిత నీటిని తొలగించే చర్యలు చేపట్టినప్పటికీ, అనంతరం కూడా కాలుష్య సమస్య కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ ఏడాది పీసీబీ అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు కనిపించలేదని తెలిపారు. దోమడుగు చెరువు కాలుష్య వ్యవహారం ప్రస్తుతం నేష నల్ గ్రీన్ ట్రిబ్యునల్ పరిధిలో విచారణలో ఉండగా, కాలుష్యాన్ని శాస్త్రీయoగా తొలగించకుండా సుందరీకరణ పనులు చేపట్టడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రకారం కాలుష్యానికి బాధ్యులైన సంస్థతోనే చెరువును పూర్తిస్థాయిలో రసాయన రహితంగా ప్రక్షాళన చేయించాలని డిమాండ్ చేశారు. ప్రతినిధులు మంగయ్య, బాల్రెడ్డి, సత్తిరెడ్డి, రాఘవరెడ్డి, వెంకటేష్, రాజుచారి, శ్రీనివాసరెడ్డితో పాటు టీపీ జేఏసీ జిల్లా చైర్మన్ వై.అశోక్ కుమార్, కో-కన్వీనర్లు ఆర్.లక్ష్మి, ఏ.మానస తదితరులు పాల్గొన్నారు.