- గతంలో ఒకే కార్పోరేషన్ పరిధిలో ఆషాఢ బోనాలు నిర్వహించాం. ఈ యేడు ఆషాఢ బోనాలను మూడు కార్పోరేషన్ల పరిధిలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నాం
- అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బోనాలను విజయవంతం చేయాలి
- భక్తులకు సౌకర్యాల కల్పనతో ఏ లోటూ రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలి
- జూమ్ మీటింగ్ ద్వారా ఎంసిఆర్ హెచ్ఆర్ డిలో నిర్వహిస్తున్న ఆషాఢమాస బోనాల సమన్వయ సమావేశంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ
- బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, మహిళల భక్తి, ప్రజల సామూహిక విశ్వాసాలకు ప్రతీక అన్న మంత్రి
- రాష్ట్రం నలుమూలల నుంచి బోనాల జాతర ఉత్సవాలను చూసేందుకు భక్తుల తరలివచ్చే పరిస్థితుల నేపథ్యంలో రవాణా శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరిన మంత్రి సురేఖ
- ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ. 20 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సురేఖ
- సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతి యేడు లాగే ఈ యేడు బోనాల ఉత్సవాలను నిర్వహించాలని అధికారులకు ఆదేశం
తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, సాంస్కృతిక సంప్రదాయాలు, జానపద వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ తెలిపారు. ప్రస్తుతం లండన్లో పర్యటనలో ఉన్న మంత్రి సురేఖ బుధవారం జూమ్ వేదికగా ఎంసిఆర్ హెచ్ఆర్ డిలో నిర్వహించిన బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశంలో పాల్గొని ఏర్పాట్లపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఇతర ఉన్నతాధికారులతో నిర్వహించిన బోనాల ఉత్సవాల సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, దానం నాగేందర్, డిజిపి సి.వి. ఆనంద్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, డైరక్టర్ హనుమంతరావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. సజ్జనార్, ధార్మిక సలహాదారు గోవింద హరి, ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ, పోలీసు, విద్యుత్, ఆర్&బీ, వాటర్ వర్క్స్, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, ఆర్టీసీ, మెట్రో, పర్యాటక, సమాచార పౌరసంబంధాల శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఈ ఏడాది ఆషాఢ జాతర ఉత్సవాలు జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని దేవాలయాల్లో నిర్వహించే బోనాల ఉత్సవాలకు సౌకర్యాల కల్పనలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టే గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయంలో జూలై 16న ప్రారంభమయ్యే ఉత్సవాలు ఆగస్టు 13 వరకు అట్టహాసంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం తాను లండన్ పర్యటనలో వున్నందున ఇక్కడి నుంచే జూమ్ మీటింగ్ ద్వారా అధికారులకు సూచనలివ్వాల్సి వస్తున్నదని అన్నారు. ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ఘటోత్సవాలు, బోనాల సమర్పణ, సాక సమర్పణ, తొట్టెల ఊరేగింపులు, పోతురాజుల వీరంగాలు, రంగం కార్యక్రమాలు, గావుపట్టడం, సాగనంపు వంటి సంప్రదాయ కార్యక్రమాలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఈ సంప్రదాయాల పరిరక్షణ కోసం ప్రభుత్వం నిష్టతో కార్యాచరణను అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు.
గత కొన్నేళ్లుగా బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం గణనీయంగా పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఈ నిధులను ఆలయాల మౌలిక వసతుల మెరుగుదల, భక్తులకు సౌకర్యాల కల్పన, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, సీసీ కెమెరాలు, క్యూలైన్లు, తాగునీటి సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణ, వైద్య శిబిరాల ఏర్పాట్లకు సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, రోడ్లు-భవనాల శాఖ, వాటర్ వర్క్స్, ఆర్టీసీ, రైల్వే, వైద్య ఆరోగ్య శాఖ, అగ్నిమాపక శాఖ, పర్యాటక శాఖ, సమాచార పౌరసంబంధాల శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా భారీ రద్దీ ఉండే దేవాలయాల వద్ద ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళికలు, అదనపు బస్సులు, వైద్య బృందాలు, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. వృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులు, బాలింతల కోసం లాక్టేషన్ రూమ్ లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ ఉచిత బస్సు ద్వారా బోనాల ఉత్సవాలు జరిగే ప్రాంతాలకు రాష్ట్రం నలుమూలల నుంచి తాకిడి వుండే పరిస్థితుల నేపథ్యంలో ఈ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదాయశాఖపై, దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రధ్దతో కోట్లాది రూపాయల నిధులు అందిస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులను కేటాయించినందుకు సీఎంకు మంత్రి సురేఖ ధన్యవాదాలు తెలిపారు.