
దళితులకు చదువే ఆయుధమని, చదువుకు పోరాటం చేయాలని గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం కొత్తపేటలోని బాబు జగ్జీవన్‌రాం భవన్లో 2020 బాబు జగ్జీవన్‌రాం, అంబేద్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణకు షెడ్యూల్ కుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్సవాలు 15 రోజుల కాకుండా, నిరంతరం కొనసాగించాలని సూచించారు. నాయకులు బయట విగ్రహాలు పెట్టడం కాదు, ఇండ్లల్లో కూడా బీజేఆర్, అంబేద్కర్ ఫొటోలు పెట్టుకొని పిల్లలకు వారి గురించి తెలియజేయాలన్నారు. ప్రభుత్వ సహకారంతో గురుకుల పాఠశాలల విద్యార్థులు దేశంతో పాటు ఇతర దేశాల్లో చదువుతున్నారన్నారు. సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడ లేని విధంగా సైనిక్ పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
అన్ని జిల్లాలో గురుకుల పాఠశాలలో విద్యార్థులు జాయిన్ అవుతున్నప్పటికీ హైదరాబాద్ నగరంలో చేరడం లేదన్నారు. గురుకుల సోసైటీ ఆధ్వర్యంలో ఫిల్మ్ టెక్నాలజీ పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రశాంతంగా అందరు కలిసి మెలిసి ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. అనంతరం తెలంగాణ మాలల ఐక్యవేదిక అధ్యక్షుడు బేర బాలకిషన్ ఉత్సవ కమిటీ నియమించాలని ప్రవీణ్ కుమార్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ అదనపు సంచాలకులు కరుణాకర్, జాయింట్ డైరెక్టర్ వేణుగోపాల్, అధికారులు హనుమంతు నాయక్, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్, రామారావు, సుదర్శన్‌రెడ్డి, బీజేఆర్ భవన్ హాల్ ఇన్చార్జిరాజు, సిబ్బంది అశోక్, ఆర్తి పాల్గొన్నారు. అంతేకాకుండా మహేంద్రాహిల్స్‌లోని బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలల్లో నిర్వహించిన ఉన్నత విద్యా మేళాలో పాల్గొని కార్పొరేట్ పాఠశాలలకు కంటే దీటుగా గురుకులల్లో విద్యా బోధనలు ఉన్నాయ న్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నాగ కల్యాణి,సిబ్బంది పాల్గొన్నారు.