- మీ ప్రవర్తన ఇలాగే ఉంటే భవిష్యత్తులో ప్రతిపక్ష హోదా కూడా గల్లంతు
- చర్చలకు మంత్రులు వస్తే పారిపోయింది వారే
హైదరాబాద్: రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ గూండాగిరికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడేది లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై స్పందించారు. కోట్లాది రూపాయిలు కొల్లగొట్టిన బిఆర్ఎస్ నాయకులు ఇంకా అధికారంలోనే ఉన్నాం లేదా మళ్లీ అధికారంలోకి వస్తామనే భ్రమతో మాట్లాడుతున్నారు. వారి అవినీతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారు. అయినా ఇంకా అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటూ ఈ ప్రభుత్వంపై గుడ్డకాల్చి వేసినట్లు మాట్లాడుతున్నారు.
గత పదేళ్లలో వారు అంటించుకున్నబురదను ఇప్పటి ప్రభుత్వానికి లేదా మంత్రులకు అంటించాలని చూస్తున్నారు. ఐదేళ్ల పాలనకు ప్రజలు కాంగ్రెస్ కు అధికారమిస్తే మతి భ్రవించి రెండున్నరేళ్లకే గద్దె దిగమని డిమాండ్ చేయడం హాస్యాస్పదం. ఈ రెండున్నర సంవత్సరాలలో ఏం జరిగిందో ఎలాంటి తీర్పులు వచ్చాయో రాష్టప్రజలకు, దేశానికి తెలుసు.
ఏశాఖ అయినా సరే పిలిచిన టెండర్ మొత్తం కంటే మూడు నాలుగు రెట్లు అవినీతి జరిగిందని ఆరోపించడం వారి అవివేకానికి నిదర్శనం. ఇలాగే వారి ప్రవర్తన కొనసాగితే రానున్న కాలంలో వారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. మీ సవాల్ ను స్వీకరించి మా మంత్రులు వస్తే మీరు రాకుండా పరారయ్యారు. మా మంత్రులు అక్కడే గంట వరకూ వేచి చూసి మీడియాతో మాట్లాడి వచ్చారు. అసెంబ్లీ లో కూడా మీరు ఏం మాట్లాడతారో మాకు తెలుసు. దానికి కూడా తేదీని ఖరారు చేస్తాం.. అని పొంగులేటి అన్నారు.