60 లక్షల మందికి పింఛన్ల పంపిణీ – మంత్రి బొత్స సత్యనారాయణ

రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షల లబ్ధిదారులకు ఉదయం నుంచే వాలంటీర్లు పింఛన్‌ ఇచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సర్వే సమయంలో కొంత మంది ఇంట్లో లేనందున వారి పేర్లు జాబితాలో లేవని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి ప్రజా ప్రతినిధులు తీసుకెళ్లారని తెలిపారు. ఇలాంటివి పరిగణలోకి తీసుకుని రీవెరిఫికేషన్ చేయాలని సీఎం ఆదేశించారన్నారు. అర్హులకు రెండు నెలల పింఛన్ ఇవ్వాలని చెప్పారని, ఇలా రీవెరిఫికేషన్ చేయడం ద్వారా విజయనగరంలో నాలుగు వేల మంది అధికంగా ఇప్పుడు జాబితాలో చేరారని బొత్స తెలిపారు. ఉగాది రోజున అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.