- భారీ బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ
- ఎక్కడిక్కడ అరెస్టులు, నిర్భంధాలు.. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.. FDC మాజీ ఛైర్మన్ ప్రతాప రెడ్డి అరెస్ట్
- ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం: అదనపు కలెక్టర్ నగేష్
- ప్రజలకు నష్టం కలిగించే ఎమ్మెస్ అగర్వాల్ పరిశ్రమ విస్తరణకు అనుమతులు ఇవ్వకూడదు: మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి
- ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమతో అధికారులు కుమ్మక్కు: స్థానిక ప్రజలు
ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రిస్ పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని, ఆ పరిశ్రమను విస్తరించి మా ప్రాణాలు తీయొద్దని చెట్లగౌరారం, రంగాయపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మనోహరాబాద్ మండలం రంగాయపల్లి, చెట్లగౌరారం గ్రామాల శివారులోని ఎమ్మెస్ అగర్వాల్ పరిశ్రమ విస్తరణపై పీసీబీ (PCB) ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అదనపు కలెక్టర్ నగేశ్, పీసీబీ ఈఈ మాధురి, తూప్రాన్ ఆర్డీవో భావయ్య, తహసీల్దారు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు తమ ఆవేదనను ఇలా తెలియజేశారు. ప్రజలకు నష్టం కలిగించే పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన ప్రతాప్ రెడ్డిని పరామర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసుల పహరా మధ్య ప్రభిప్రాయ సేకరాణ నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిచారు. ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజల మధ్య జరగాలని కానీ అధికారులు పోలీసుల మధ్య నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెస్ అగర్వాల్ పరిశ్రమ విస్తరణకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు.
పరిశ్రమ నుంచి వెలువడుతున్న వాయు, శబ్ద కాలుష్యం, కలుషిత జలాలతో నరకయాతన అనుభవిస్తున్నామన్నారు. భయంకర శబ్దాలు, వెలువడుతున్న హానికర పొగతో రాత్రివేళ నిద్రపోలేకపోతున్నామని, గర్భిణులు, చిన్నపిల్లలకు రోగాలు వస్తున్నాయని, కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని గ్రామాల్లో నుండి ఖాళీ చేయించి మరో చోట పునరావాసం కల్పించి అనుమతి ఇవ్వాలని కోరారు. కొందరు పెద్దమనుషుల ముసుగులో పరిశ్రమ యాజమాన్యానికి తొత్తులుగా మారి ప్రజల ఉసురు తీసేందుకు యత్నిస్తున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విస్తరణకు అంగీకరించమని స్పష్టంచేశారు. అధికారులు పరిశ్రమ వారి దగ్గర భారీగా లంచాలు తీసుకుని వారికి అనుకూలంగా పనిచేస్తున్నారని స్థానికులు తెలిపారు. పరిశ్రమ యాజమాన్యం స్థానిక యువతకు అరకొరే ఉపాధి అవకాశాలు కల్పించిందని వాపోయారు. గ్రామాల అభివృద్ధికి సీఎస్సార్ నిధులు కేటాయించాలని కోరారు.
ప్రజాభిప్రాయ సేకరణను గ్రామస్థులు అడ్డుకుంటారన్న సమాచారంతో 200 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పర్యవేక్షించారు. అందరి గుర్తింపు కార్డు క్షుణ్నంగా తనీఖీ చేసి అనుమతి ఇచ్చారు. డీఎస్పీ నరేందర్ గౌడ్ ఉన్నారు. చెట్లగౌరారం పరిధిలోని ఎంఎస్ అగర్వాల్ ఫౌండ్రిస్ పరిశ్రమతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని BRS నేతలు ఆందోళనకు దిగారు. విస్తరణకు దొంగచాటుగా అనుమతించేందుకు పీసీబీ సహా పలు శాఖల అధికారులు యత్నిస్తున్నారని విమర్శించారు. BRS గజ్వేల్ నియోజకవర్గ బాధ్యుడు ప్రతాప్ రెడ్డి, మండలాధ్యక్షుడు చంద్రశేఖ గౌడ్, మాజీ సర్పంచి నాగభూషణం తదితరులను పోలీసులు అరెస్టు చేసి చిన్నశంకరంపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పరిశ్రమలో 6 లక్షల టన్నుల నుంచి 10.70 లక్షల టన్నులకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించాం. పర్యావరణ పరి రక్షణకు చర్యలు తీసుకుంటాం. తీసుకుంటాం. విస్తరణ విస్తరణతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కాలుష్యం ఏర్పడదు. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని పరిశ్రమ ప్రతినిధి తెలిపారు.
ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం: అదనపు కలెక్టర్ నగేష్
ప్రజల అభిప్రాయాలను వీడియో ద్వారా రికార్డు చేశాం. స్థానికుల అభిప్రాయాలను కేంద్ర, రాష్ట్ర కాలుష్య, పర్యావరణ మంత్రిత్వ శాఖకు పంపిస్తాం. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోం. ప్రజల ఇష్టం మేరకు మాత్రమే పరిశ్రమ విస్తరణకు అనుమతి ఉంటుంది.