- పారదర్శక అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించాలి
- వర్షాకాల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు
- నాణ్యమైన బోధనకు పటిష్ట చర్యలు చేపట్టాలి
- TGSWREIS, TGTWREIS సమీక్షలో అధికారులను ఆదేశించిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
హైదరాబాద్ : తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రత, నాణ్యమైన విద్యకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో తాగునీరు, వేడి నీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలపై ప్రత్యేక నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని మంత్రి కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం TGSWREIS, TGTWREIS విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ప్రక్రియ, విద్యా నిర్వహణ, విద్యార్థుల సంక్షేమం, వర్షాకాల ఏర్పాట్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లురి మాట్లాడుతూ… గురుకులాల్లో ప్రవేశాల ప్రక్రియ పూర్తిస్థాయి పారదర్శకతతో, నిబంధనలకు అనుగుణంగా చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గత విద్యాసంవత్సరంతో పోలిస్తే ఈసారి అడ్మిషన్ల సంఖ్య పెరిగిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, వసతి, తరగతి గదులు, బోధన సిబ్బంది, వంటశాలల సామర్థ్యాన్ని పెంచాలని మంత్రి సూచించారు. ఎక్కడైనా బోధన సిబ్బంది కొరత ఉంటే సంబంధిత జిల్లా కలెక్టర్ల అనుమతితో నిబంధనల ప్రకారం తాత్కాలిక నియామకాలు చేపట్టి బోధనకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు.
వర్షాకాలంలో వైరల్ జ్వరాలు, డెంగీ, మలేరియా, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు పెరుగుతుందని, ప్రతి గురుకులంలో ముందస్తు ఆరోగ్య ప్రణాళిక అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థులకు అవసరమైన వేడి నీరు అందుబాటులో ఉంచాలని, తాగునీరు పరిశుభ్రంగా ఉండేలా నీటి ట్యాంకుల శుభ్రపరిచే కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. నీటి నాణ్యతను పరీక్షించి, అవసరమైన చోట వాటర్ ప్యూరిఫైయర్లు, క్లోరినేషన్, ఫిల్టరేషన్ సదుపాయాలను సమర్థంగా వినియోగించాలని చెప్పారు. బాలికల గురుకులాలు, హాస్టళ్లలో మరింత అప్రమత్తత అవసరమని మంత్రి పేర్కొన్నారు. టాయిలెట్లు, బాత్‌రూమ్‌లు ప్రతిరోజూ శుభ్రంగా, పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సానిటరీ న్యాప్‌కిన్ల అందుబాటు, డిస్పోజల్ యూనిట్లు, మహిళా ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు, అవసరమైన చోట మహిళా కౌన్సెలర్ల సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.
ప్రతి గురుకులంలో ప్రాథమిక వైద్య సదుపాయాలు, అత్యవసర మందులు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉండాలని మంత్రి తెలిపారు. సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులతో సమన్వయం చేసుకుని విద్యార్థులకు నిరంతర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జ్వరం, వాంతులు, విరేచనాలు, చర్మవ్యాధులు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైతే చికిత్సకు పంపే విధంగా ఆరోగ్య ప్రోటోకాల్ అమలు చేయాలని సూచించారు. వంటశాలలు, డైనింగ్ హాళ్లు, నిల్వ గదుల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు. నాణ్యమైన కూరగాయలు, పాలు, గుడ్లు, ఇతర ఆహార పదార్థాల సరఫరా నిరంతరంగా జరిగేలా పర్యవేక్షించాలని, నిల్వ ఆహార పదార్థాల నాణ్యతను తరచుగా తనిఖీ చేయాలని చెప్పారు. విద్యార్థులకు పౌష్టికాహారం, సురక్షితమైన వసతి, ఆరోగ్యకరమైన విద్యా వాతావరణం కల్పించడం సంస్థల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.
సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను దశలవారీగా విస్తరించేందుకు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు పోటీ పరీక్షల శిక్షణ, ఉన్నత విద్యా అవకాశాలు మరింత చేరువయ్యేలా సీఓఈల విస్తరణకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగుల వేతనాలు ప్రతి నెలా ఒకటో తేదీన జమయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వేతనాల విడుదలలో జాప్యం లేకుండా ఆర్థిక, పరిపాలనా ప్రక్రియలను ముందుగానే పూర్తి చేయాలని చెప్పారు. సిబ్బంది సంక్షేమం, సమయపాలన, బాధ్యతాయుతమైన సేవలతోనే విద్యార్థులకు మెరుగైన ఫలితాలు అందుతాయని పేర్కొన్నారు. సంస్థల ప్రధాన కార్యాలయ స్థాయి నుంచి జిల్లా, పాఠశాల స్థాయి వరకు పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి గురుకులంలో వర్షాకాల ఏర్పాట్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ఆహార నాణ్యతపై వారానికోసారి నివేదికలు తీసుకోవాలని, లోపాలు గుర్తించిన వెంటనే సరిదిద్దాలని సూచించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి,
ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సంతోష్ ,తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సంస్థ కార్యదర్శి శ్రీమతి కంభంపాటి శారద, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల అదనపు కార్యదర్శి నటరాజ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.