ఎంఎస్ అగర్వాల్ కంపెనీ మాకొద్దు.. పరిశ్రమను మూసే వరకు పోరాటం ఆగదు..

  • ఎంఎస్ అగర్వాల్ కంపెనీ ఎత్తివేయాలని ప్రజల పక్షాన నిరాహార దీక్ష కార్యక్రమం చేపడుతాం
  • రంగయ్యపల్లి, చెట్ల గౌరారం గ్రామాల ప్రజలకు శాపంగా మారిన ఎంఎస్ అగర్వాల్ కంపెనీ
  • ఎంఎస్ అగర్వాల్ కంపెనీని వెంటనే తొలగించాలి: గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి

ఎంఎస్ అగర్వాల్ కంపెనీని వెంటనే తొలగించాలని గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. రంగయ్యపల్లి గ్రామంలో ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరూ ముక్తకంఠంతో ఎంఎస్ అగర్వాల్ కంపెనీ మాకు వద్దు.. మా పిల్లల, మా ప్రాణాలే మాకు ముద్దని నినదించారు. ఎంఎస్ అగర్వాల్ కంపెనీ నుండి వెలువడే కాలుష్యంతో తమ ప్రాణాలకు జరిగే నష్టాన్ని మరియు తమ ఆరోగ్యాలు క్షిణిస్తున్నాయని తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. దాదాపు 20 సంవత్సరాల నుండి ఎంఎస్ అగర్వాల్ కంపెనీ నుండి వెలువడే కాలుష్యం ద్వారా, బూడిద ద్వారా వందలాది మంది చనిపోయారని, వేలాది మంది అనారోగ్యం పాలయ్యారని, ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయని, చర్మవ్యాధులు ఊపిరితిత్తులు, కిడ్నీలు, గుండె జబ్బుల బారిన పడుతున్నారని అన్నారు. కలుషితమైన భూగర్భ జలాల ద్వారా బోర్ల నీళ్లు తాగే పరిస్థితి లేకుండా పోయిందని పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. ఎంఎస్ అగర్వాల్ కంపెనీ ప్రజలకు శాపంగా మారిందని ప్రజల ప్రాణాలతో.. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. రాత్రింబవళ్లు కంపెనీ నడపడం వలన పెద్దపెద్ద శబ్దాలతో విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి, నిద్రపోలేని పరిస్థితి కలుషితమైన ఆహారం తిని రోగాల బారిన పడిన దుస్థితి, ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీ తెచ్చి పెట్టిందన్నారు. కంపెనీలో ప్రతినెల ఇద్దరి నుండి ముగ్గురు వరకు చనిపోతా ఉన్నా గుట్టుచప్పుడు కాకుండా కంపెనీ యాజమాన్యం వివిధ డిపార్ట్మెంట్ వారితో కుమ్మక్కై ప్రజల జీవితాలతో చెలగాట మాడుతుందని మండిపడ్డారు. కంపెనీలో బీహార్, యూపీకి చెందిన వారు పనిచేస్తున్నారని స్థానికంగా ఉన్న ప్రజలను రోగాల పాలు చేస్తున్నారని అన్నారు. పోలీస్ డిపార్ట్ మెంట్ వారు కంపెనీ యాజమాన్యం ఒక్కటై కంపెనీ నెత్తివేయాలని ప్రశ్నించిన రెండు గ్రామాల ప్రజలపై అక్రమంగా కేసులు పెట్టి భయానకమైన వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టించిందని మండిపడ్డారు. పోలీసుల అండతో కంపెనీ యాజమాన్యం రెచ్చిపోయి మితిమీరి ప్రజల జీవితాలతో ఆడుకుంటూ, రోగాల బారిన పడి ప్రజలు చనిపోయిన మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడు తుందని మండిపడ్డారు, మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ ముందు ప్రైవేటు వ్యక్తులచే దొంగ కార్డులను సృష్టించి తప్పుడు ప్రజా అభిప్రాయసేకరణ చేయించడం జరిగిందని దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీని రద్దుచేసి కంపెనీ యాజమాన్యంపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులతో అక్రమ అరెస్టులతో పోలీసు వారి అండదండలతో కంపెనీ యాజమాన్యం హద్దులు దాటి మితిమీరి పోతున్నారని అన్నారు. ఇకపై ఎవరికి భయపడే ప్రసక్తి లేదని చెట్ల గౌరారం, రంగయ్యపల్లి గ్రామాల ప్రజల తరపున ప్రజా పోరాటం చేస్తామని ఎంఎస్ అగర్వాల్ కంపెనీని తీసివేసే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ప్రజల క్షేమం ప్రజల ఆరోగ్యం పిల్లల భవిష్యత్తును కోరుకుంటుందని అన్నారు. ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీ నడిస్తే అగర్వాల్ కుటుంబమే బ్రతుకుతుందని, ఆగర్వాల్ కుటుంబం సంతోషంగా ఉంది కానీ రెండు గ్రామాల ప్రజల కుటుంబాలు ఆగమైపోతున్నాయని, ప్రజల ఆరోగ్యం క్షీణిస్తూ మృత్యువాత పడుతున్నారని, కుటుంబాలు రోడ్ల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీ వెంటనే ఎత్తివేయాలని అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని, కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారని, రెండు గ్రామాల నడిబొడ్డున ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కంపెనీ వెంటనే ఎత్తివేయాలని ఆదివారం రోజున ప్రజల పక్షాన నిరాహార దీక్షచేస్తామని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.