- టీజీఎస్పీడీసీఎల్ “సురక్ష 2026” సేఫ్టీ ఎక్స్పో & వర్క్‌షాప్‌లో సీఎండీ జితేష్ వి. పాటిల్
విద్యుత్ రంగంలో ప్రమాదాలను పూర్తిగా నివారించడం, క్షేత్రస్థాయి ఉద్యోగుల భద్రతను మరింత బలోపేతం చేయడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు భద్రతా పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహించిన “సురక్ష 2026 – సేఫ్టీ ఎక్స్పో & వర్క్‌షాప్” ను సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్ శనివారం హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్ కార్పొరేట్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ, విద్యుత్ పంపిణీ వ్యవస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగి ప్రాణం సంస్థకు అమూల్యమని, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదా అతివిశ్వాసానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు. భద్రత అనేది కేవలం నిబంధనల పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రతి ఉద్యోగి ఆచరణలో భాగం కావాలని సూచించారు. టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని 21 సర్కిళ్ల నుంచి హాజరైన ఫోర్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు మరియు ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది విద్యుత్ ప్రమాదాల నివారణలో కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు. ఫోర్మెన్లు తమ బృందాలకు నాయకత్వం వహిస్తూ, భద్రతా ప్రమాణాల అమలును పర్యవేక్షించాలని, లైన్ ఇన్స్పెక్టర్లు ప్రతి పనిలో భద్రతా నిబంధనలు పాటించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సైన్యంలో కమాండర్ తన సిబ్బందిని రక్షించినట్లే, విద్యుత్ శాఖలో ఫోర్మెన్లు మరియు లైన్ ఇన్స్పెక్టర్లు తమ సిబ్బంది ప్రాణ భద్రతకు బాధ్యత వహించాలన్నారు.
ఏ పని ప్రారంభించే ముందు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేయబడిందా, రివర్స్ ఫీడింగ్, ఇన్వర్టర్లు, యూపీఎస్‌లు, జనరేటర్లు లేదా ఇతర ప్రత్యామ్నాయ విద్యుత్ వనరుల ద్వారా విద్యుత్ ప్రవాహం లేదని నిర్ధారించుకోవడం తప్పనిసరి అని తెలిపారు. విద్యుత్ పనుల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అత్యంత ప్రమాదకరమని, ప్రతి ఉద్యోగి ఒక నిమిషం ఆలోచించి భద్రతా ప్రమాణాలను ధృవీకరించిన తర్వాతే పని ప్రారంభించాలని సూచించారు. సంస్థ లక్ష్యం కేవలం ప్రమాదాల సంఖ్య తగ్గించడం మాత్రమే కాదని, “జీరో ఫేటల్ యాక్సిడెంట్స్ – జీరో నీర్ మిస్ ఇన్సిడెంట్స్” సాధించడమేనని పేర్కొన్నారు. ఉద్యోగుల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన ప్రతి భద్రతా పరికరం, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ మరియు మౌలిక సదుపాయాలను అందించేందుకు సంస్థ పూర్తి కట్టుబాటుతో పనిచేస్తోందన్నారు. విద్యుత్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని పేర్కొంటూ, ఇన్సులేటెడ్ టూల్స్, ఎర్తింగ్ పరికరాలు, సేఫ్టీ హార్నెస్‌లు, ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్స్, హైడ్రాలిక్ మరియు మెకానికల్ లిఫ్టింగ్ పరికరాలు, బ్యాటరీ ఆధారిత ట్రీ ట్రిమ్మింగ్ పరికరాలు, ఆధునిక టెస్టింగ్ ఉపకరణాలు వంటి పరికరాల వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, అవసరాలు మరియు సాంకేతిక సూచనలను స్వేచ్ఛగా తెలియజేయాలని కోరారు. భద్రతా పరికరాల ఎంపిక, వినియోగం, నిర్వహణలో ఉద్యోగుల అనుభవాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, ఫీడర్లు, లైన్లు, మీటరింగ్ వ్యవస్థలు, స్ట్రీట్ లైటింగ్ నెట్‌వర్క్‌లు, ట్రీ ట్రిమ్మింగ్ కార్యకలాపాలు తదితర అన్ని విభాగాల్లో ప్రత్యేక భద్రతా ప్రమాణాలు అవసరమని పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ రక్షణ కంచెల ఏర్పాటు, ఆయిల్ లీకేజీల నివారణ, తెగిపోయిన విద్యుత్ తీగల గుర్తింపు, ప్రమాదకర ప్రాంతాల మ్యాపింగ్, స్నాప్డ్ కండక్టర్లపై ప్రత్యేక నిఘా వంటి చర్యలను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. భద్రత ఉద్యోగులకు మాత్రమే పరిమితం కాకుండా వినియోగదారులు, రైతులు మరియు సాధారణ ప్రజల్లో కూడా అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, తెగిపోయిన తీగలు, డిస్ట్రిబ్యూషన్ పరికరాల సమీపంలో జాగ్రత్తలు పాటించాల్సిన అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సేఫ్టీ ఎక్స్పోలోని ప్రతి స్టాల్‌ను సీఎండీ జితేష్ వి. పాటిల్, డైరెక్టర్లు మరియు ఉన్నతాధికారులు స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఆయా సంస్థల ప్రతినిధులు తమ ఉత్పత్తుల పనితీరు, భద్రతా ప్రయోజనాలు, వినియోగ విధానాలపై వివరాలు అందించారు. క్షేత్రస్థాయి ఉద్యోగుల భద్రతకు ఉపయోగపడే ఆధునిక సాంకేతిక పరిష్కారాలపై సీఎండీ ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో వ్యక్తిగత భద్రతా పరికరాలు (PPE), ఇన్సులేటెడ్ టూల్స్, ఎర్తింగ్ పరికరాలు, ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ టెస్టింగ్ పరికరాలు, ట్రీ ట్రిమ్మింగ్ ఉపకరణాలు, అగ్నిమాపక భద్రతా పరికరాలు, క్లైంబింగ్ ఎక్విప్మెంట్, హై వోల్టేజ్ భద్రతా ఉత్పత్తులు తదితర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ప్రదర్శించారు. పాల్గొన్న సంస్థల ప్రతినిధులు ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా విద్యుత్ శాఖ సిబ్బందికి వాటి వినియోగం, ప్రాముఖ్యత మరియు భద్రతా ప్రయోజనాలను వివరించారు. ఉద్యోగులు, వినియోగదారులు మరియు ప్రజల ప్రాణ భద్రతను పరిరక్షించేందుకు భవిష్యత్తులో మరిన్ని సేఫ్టీ కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు మరియు సాంకేతిక నవీకరణలను చేపట్టనున్నట్లు సీఎండీ వెల్లడించారు.
“సేఫ్టీ ఫస్ట్ – సురక్షిత ఉద్యోగి, సురక్షిత విద్యుత్ వ్యవస్థ, సురక్షిత సమాజం” అనే లక్ష్యంతో టీజీఎస్పీడీసీఎల్ భద్రతా ప్రమాణాల అమలుకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ నిరంతరం కట్టుబడి ఉందని సీఎండీ శ్రీ జితేష్ వి. పాటిల్ పునరుద్ఘాటించారు. సురక్ష 2026 సేఫ్టీ ఎక్స్పో ప్రధాన ఉద్దేశ్యం విద్యుత్ రంగంలో “జీరో యాక్సిడెంట్స్” లక్ష్యాన్ని సాధించడం. ఈ ఎక్స్‌పోలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భద్రతా పరికరాలు, విద్యుత్ నిర్వహణ ఉపకరణాలు, వ్యక్తిగత రక్షణ సామగ్రి (PPE), ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్స్, ఇన్సులేటెడ్ టూల్స్, ఎర్తింగ్ పరికరాలు మరియు ఆధునిక భద్రతా సాంకేతిక పరిష్కారాలను అందించే 18కి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. ఆయా సంస్థల ప్రతినిధులు ప్రత్యక్ష ప్రదర్శనలు, సాంకేతిక ప్రజెంటేషన్ల ద్వారా క్షేత్రస్థాయి ఉద్యోగులకు భద్రతా పరికరాల వినియోగం, వాటి ప్రాముఖ్యత మరియు ప్రమాదాల నివారణలో వాటి పాత్రపై అవగాహన కల్పించారు. విద్యుత్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగి సురక్షితంగా విధులు నిర్వహించేందుకు అవసరమైన అత్యాధునిక భద్రతా పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం మరియు వినూత్న పరిష్కారాలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడమే ఈ సేఫ్టీ ఎక్స్పో ప్రధాన లక్ష్యమని టీజీఎస్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. ఉద్యోగుల భద్రత, ప్రజల ప్రాణ రక్షణ మరియు ప్రమాదరహిత విద్యుత్ సేవలందించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
సురక్ష 2026 సేఫ్టీ ఎక్స్‌పోలో పాల్గొన్న ప్రధాన సంస్థలు
సురక్ష 2026 సేఫ్టీ ఎక్స్పో & వర్క్‌షాప్‌లో విద్యుత్ భద్రత, వ్యక్తిగత రక్షణ పరికరాలు (PPE), ఇన్సులేటెడ్ టూల్స్, ఎర్తింగ్ పరికరాలు, ట్రీ ట్రిమ్మింగ్ ఉపకరణాలు, ఫాల్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ మరియు ఇతర ఆధునిక భద్రతా సాంకేతిక పరిజ్ఞానాలను ప్రదర్శిస్తూ పలు ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. పాల్గొన్న ప్రధాన సంస్థల్లో శ్రావణి ఎలక్ట్రికల్ వర్క్స్, రుద్ర ఎంటర్ప్రైజెస్, వైఎస్ఎస్ గ్రూప్, లక్ష్మీ నరసింహ ఎలక్ట్రికల్స్, శ్రీ సాయిబాబా ఎంటర్ప్రైజెస్, ప్రదీప్ ఎంటర్ప్రైజెస్, ఆకృతి ఎంటర్ప్రైజెస్, శ్రీరామ ఎంటర్ప్రైజెస్, మీరా ఎంటర్ప్రైజెస్, పయనీర్ ఎంటర్ప్రైజెస్, వాయుపుత్ర ట్రేడర్స్, నవ్య ఎలక్ట్రానిక్స్, వెన్నెల ఎలక్ట్రికల్స్, లైట్స్ అన్లిమిటెడ్, ఎస్ఎస్ ఇంజినీర్స్, శివశక్తి ఎలక్ట్రికల్స్, రామబాణం, ఇంప్రొవైజ్డ్ సొల్యూషన్స్, గోయమ్ ఎంటర్ప్రైజెస్, స్వస్తిక్ ఎంటర్ప్రైజెస్, సునీత ఎలక్ట్రికల్స్, రాఘవేంద్ర ఎంటర్ప్రైజెస్, విజయ శాంతి ఎలక్ట్రికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, గురు అండ్ కంపెనీ, ఎలక్ట్రోఆర్క్ పవర్ ఇంజినీరింగ్, నన్నం ఇండస్ట్రీస్, కరమ్ సేఫ్టీ ప్రైవేట్ లిమిటెడ్, ఎంబీ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్, మిలీనియల్ సేఫ్టీ ఎంటర్ప్రైజెస్, శ్రీ హర్షిణి ఎలక్ట్రికల్స్, ఋషికేశ్ ఎంటర్ప్రైజెస్, టీమ్‌వన్ కాంపోజిట్స్, భారత్ ఎలక్ట్రోసేఫ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు భారత్ స్మార్ట్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ సంస్థల ప్రతినిధులు తమ ఉత్పత్తులను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తూ, విద్యుత్ శాఖ క్షేత్రస్థాయి సిబ్బందికి వాటి వినియోగం, భద్రతా ప్రయోజనాలు మరియు ప్రమాదాల నివారణలో వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ వర్క్‌షాప్‌లో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎన్. నర్సింహులు, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) వి. శివాజీ, డైరెక్టర్ (కమర్షియల్ & హెచ్ఆర్) చి. చక్రపాణి, డైరెక్టర్ (ఫైనాన్స్) పి. కృష్ణారెడ్డి, చీఫ్ ఇంజనీర్ (ఆపరేషన్స్) రవి కుమార్, వివిధ జోన్లు మరియు సర్కిళ్లకు చెందిన చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ అధికారులు, ఫోర్మెన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, ఆర్టిజన్లు మరియు ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
