ఎల్-నినో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • ఎల్-నినో పరిస్థితులతో రైతు నష్టపోకుండా మూడు దశల ముందస్తు కార్యాచరణలో మొదటి దశ కార్యచరణ అమలుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశం
  • ఇక్రిశాట్‌లో శాస్త్రవేత్తలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల
  • శాస్త్రవేత్తలు సూచించిన యాజమాన్య చర్యలను రైతులకు తెలియజేసి, రైతులు క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేసే విధంగా చూడాలి
  • కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉండాలి
  • వాతావరణ, భూగర్బజలాలు, నీటిలభ్యత పరిస్థితులపై మండలాల వారీగా వారపు బులెటిన్ విడుదల చేయాలి
  • ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో ఎల్-నినోపై రైతులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తాం

హైదరాబాద్ : వానాకాలం–2026లో ఎల్-నినో ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేలా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ (ICRISAT)లో భారత వాతావరణ శాఖ (IMD), ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్ (IIOR), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (IIMR), సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ (CRIDA) శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధరంగ ఉన్నతాధికారులతో మంత్రి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మూడు దశల కంటింజెన్సీ ప్రణాళికలను ఈ సమావేశంలో సమగ్రంగా పరిశీలించి, శాస్త్రవేత్తలు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తుది కార్యాచరణపై మంత్రి చర్చించారు. ముందుగా వివిధ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు ఎల్-నినో పరిస్థితులను తట్టుకునేవిధంగా వారు వారు సిద్ధం చేసిన కార్యచరణను మంత్రికి తెలియచేశారు. ముఖ్యంగా కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా తట్టుకొనే పంటలు మరియు రకాలు, ఇప్పటికే సాగు చేసిన పంటలలో తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శాస్త్రవేత్తలు సూచించిన ప్రతి యాజమాన్య చర్యను క్షేత్రస్థాయిలో రైతులకు చేరవేసి, జిల్లాల్లో అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అనుబంధరంగ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. తరువాత మాట్లాడిన వ్యవసాయశాఖ డైరెక్టర్ గారు.. ఎల్-నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమవడం, మధ్యలో దీర్ఘకాలిక పొడి పరిస్థితులు (Dry Spells), అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని జూలై 15, జూలై 30, ఆగస్టు 15 తేదీలను ప్రాతిపదికగా తీసుకుని మూడు దశల్లో రాష్ట్రవ్యాప్త కంటింజెన్సీ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా జిల్లా వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు చెప్పారు.

జూలై 15 వరకు వర్షాలు ఆలస్యమైతే 16.30 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, జూలై 30 వరకు ఆలస్యమైతే 13.82 లక్షల క్వింటాళ్లు, ఆగస్టు 15 వరకు వర్షాభావ పరిస్థితులు కొనసాగితే 12.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేసి ముందుగానే అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆ తరువాత మాట్లాడిన ఇరిగేషన్ శాఖ , భూగర్భజలశాఖ, మరియు మిగతాశాఖ అధికారులు మంత్రిగారికి నీటిలభ్యత వివరాలు మరియు విద్యుత్ సరఫరాకు సంబంధించిన రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 33 జిల్లాల వర్షపాతం పరిస్థితులను ప్రభుత్వం రోజువారీగా సమీక్షించాలని మంత్రి తెలిపారు. ప్రస్తుత నివేదిక ప్రకారం 13 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా, 20 జిల్లాల్లో వర్షపాతం లోటు ఉందన్నారు. వర్షాభావ జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సంయుక్తంగా పరిస్థితులను సమీక్షిస్తూ అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాల్సిందిగా సూచించారు. శాస్త్రీయ విధానాలతో ఎల్-నినోను ఎదుర్కోవాలని, దీనికి సంబంధించి రాష్ట్రంలో Dynamic District Specific Response (DSR) విధానాన్ని అమలు చేయాలని మంత్రి సూచించారు. ఇందులో భాగంగా నిజ సమయ వర్షపాతం పర్యవేక్షణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు, నేల తేమ పర్యవేక్షణ, పంటల ఎదుగుదల అంచనా, వాతావరణ ప్రమాద విశ్లేషణ, ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణ ప్రణాళిక, పొలంలోనే నేల తేమ సంరక్షణ చర్యలు, పంటల వైవిధ్యీకరణ వంటి శాస్త్రీయ విధానాలను అమలు చేయాలని ఆదేశించారు.

  • వాతావరణ, భూగర్బజలాలు, నీటిలభ్యత పరిస్థితులపై మండలాల వారీగా వారపు బులెటిన్ *
    ఎల్-నినో పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవాలంటే వివిధ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని మంత్రి తుమ్మల అన్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD), నీటిపారుదల శాఖ, భూగర్భ జలాల శాఖ, విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖలు సమన్వయంతో ప్రతి వారం మండలాల వారీగా సమగ్ర వ్యవసాయ-వాతావరణ బులెటిన్ (Weekly Agro-Weather Bulletin) విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆగస్టు నెలాఖరు వరకు ప్రతి వారం విడుదల చేసే ఈ బులెటిన్‌లో మండలాల వారీగా నమోదైన వర్షపాతం, రాబోయే వారానికి, నెలాఖరు వరకు ఉండే వాతావరణ పరిస్థితుల అంచనాలు, డ్రై స్పెల్స్ ఏర్పడే అవకాశాలు, గరిష్ఠ–కనిష్ఠ ఉష్ణోగ్రతలు, నేల తేమ పరిస్థితులు, భూగర్భ జలాల లభ్యత, సాగునీటి పరిస్థితి, విద్యుత్ సరఫరా, పంటల స్థితి, రైతులు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలతో పాటు నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల క్యాచ్‌మెంట్ ప్రాంతాల్లో ఈ నెల, వచ్చే నెలకు సంబంధించిన వాతావరణ అంచనాలను (Weather Forecast) విశ్లేషించి, ఆయా ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉండే నీటి నిల్వలు, ఇన్‌ఫ్లోలు, సాగునీటి లభ్యతపై ఖచ్చితమైన అంచనాలను కూడా బులెటిన్‌లో పొందుపరచాలని మంత్రి స్పష్టం చేశారు. భూగర్భ జలాల శాఖ మండలాల వారీగా భూగర్భ జలాల లభ్యతపై తాజా సమాచారాన్ని అందించి, నీటి వినియోగ ప్రణాళికను రూపొందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వారపు బులెటిన్‌ను రైతు వేదికలు, గ్రామపంచాయతీలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా వేదికలు, డిజిటల్ ప్లాట్‌ఫారాలు, స్థానిక మీడియా ద్వారా విస్తృతంగా రైతులకు చేరవేయాలని, రైతులకు ఎప్పటికప్పుడు శాస్త్రీయ సమాచారం అందేలా వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు.

శాస్త్రవేత్తలు సూచించిన యాజమాన్య చర్యలను అమలు చేయాలి
ఇక్రిశాట్‌లో జరిగిన సమీక్షలో శాస్త్రవేత్తలు వర్షాకాలం ఆలస్యంగా ప్రారంభమవడం, దీర్ఘకాలిక పొడి పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పలు కీలక సూచనలు చేశారు. వర్షపాతం నమోదై భూమిలో తగినంత తేమ ఏర్పడిన తర్వాత మాత్రమే విత్తనాలు వేయాలని, బ్రాడ్ బెడ్ అండ్ ఫరో (BBF) లేదా రిడ్జ్ అండ్ ఫరో పద్ధతులను అనుసరించాలని, భూమిలో తేమ ఏర్పడే వరకు ఎరువుల వినియోగాన్ని వాయిదా వేయాలని, నేల తేమను కాపాడేందుకు తరచూ ఇంటర్ కల్టివేషన్ చేపట్టాలని, వర్షాలు కురిసిన తర్వాత మాత్రమే సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని, పొటాష్ ఎరువులు వేయాలని శాస్త్రవేత్తలు సూచించారు.

అలాగే పంటల కీలక ఎదుగుదల దశల్లో ప్రాణాధార నీటిపారుదల అందించడం, వరుస పంటల్లో స్కిప్ రో ఇరిగేషన్ అమలు చేయడం, దీర్ఘకాలిక పొడి పరిస్థితుల్లో 2 శాతం యూరియా లేదా 1 శాతం పొటాషియం నైట్రేట్ (KNO₃) ద్రావణాన్ని ఆకులపై పిచికారీ చేయడం, ప్రతి 3.6 మీటర్లకు ఒక డెడ్ ఫరో ఏర్పాటు చేసి వర్షపు నీటిని సంరక్షించడం, వ్యవసాయ కుంటల్లో నిల్వ చేసిన నీటిని అవసరమైన సమయంలో వినియోగించడం, అంతర పంటలను ప్రోత్సహించడం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను తప్పనిసరిగా పాటించాలని శాస్త్రవేత్తలు సూచించారని మంత్రి తెలిపారు. ఈ సూచనలన్నింటినీ రైతులకు క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో చేరవేసి, అమలయ్యేలా జిల్లా అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

వరి రైతులకు ప్రత్యేక సూచనలు
శాస్త్రవేత్తలు సూచించనట్టుగా.. ప్రస్తుతం వరి పంట నారుమడి దశలో ఉన్న రైతులు నారు పీకడానికి వారం రోజుల ముందు ఎకరానికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3CG గ్రాన్యూల్స్ వేయాలని, నాటే సమయంలో నారు ఆకుల చివరలను కత్తిరించి నాటాలని, 15×10 సెంటీమీటర్ల దూరంతో దగ్గరగా నాటి ప్రతి గుంతలో 6–8 మొక్కలు ఉంచాలని, సిఫార్సు చేసిన మోతాదుతో పోలిస్తే 25 శాతం అదనపు నత్రజని ఇవ్వాలని, మొత్తం నత్రజనిలో 70 శాతం నాటే సమయంలో, మిగిలిన 30 శాతం పూత ప్రారంభ దశలో వేయాలని మంత్రి అన్నారు. నీటి పొదుపు కోసం Alternate Wetting and Drying (AWD) పద్ధతిని అమలు చేయాలని తెలిపారు. ఇంకా నారు వేయని రైతులు తక్కువ కాలంలో పండే రకాలతో డ్రై డైరెక్ట్ సీడెడ్ రైస్ (DDSR) విధానాన్ని అనుసరించాలని సూచించారు. కాలువల ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యతను బట్టి వరికి బదులుగా మొక్కజొన్న, సజ్జలు, రాగులు, కందులు, మినుములు, పొద్దుతిరుగుడు, నువ్వులు, అలసందలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని తెలిపారు.

మొక్కజొన్న, పత్తి రైతులకు అప్రమత్తత అవసరం
ఇప్పటికే సాగుచేసిన మొక్కజొన్న, పత్తి పంటలు ప్రస్తుతం మొలక దశలో ఉన్నందున రాబోయే రెండు వారాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగితే నేల తేమను కాపాడేందుకు కలుపు నియంత్రణ చర్యలు రైతులకు సూచించాలని మంత్రి తెలిపారు. విత్తనాలు, ఎరువుల కొరత ఉండదు. రాష్ట్రంలో అవసరమైన విత్తనాలు, ఎరువులపై ఇప్పటికే సమగ్ర అంచనా పూర్తి చేశామని మంత్రి తెలిపారు. మూడు దశల కంటింజెన్సీ ప్రణాళికలకు అనుగుణంగా అవసరమైన విత్తనాలను ముందుగానే సమీకరించామని, మార్క్‌ఫెడ్‌, విత్తన సంస్థలు, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రైతులకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

‘రైతు నేస్తం’లో ప్రత్యేక అవగాహన
‘రైతు నేస్తం’ కార్యక్రమంలో ఎల్-నినో ప్రభావాలు, ప్రత్యామ్నాయ సాగు, నీటి యాజమాన్యం, నేల తేమ సంరక్షణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ పద్ధతులు, శాస్త్రవేత్తలు సూచించిన యాజమాన్య చర్యలపై రైతులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తామని మంత్రి తెలిపారు. ప్రతి రైతు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేలా వ్యవసాయ అధికారులు గ్రామస్థాయిలో మార్గనిర్దేశం చేస్తారని చెప్పారు. “ఎల్-నినో ప్రభావం ఎంత తీవ్రంగా ఉన్నా రైతు నష్టపోకుండా అవసరమైన ప్రతి చర్య తీసుకుంటాం. శాస్త్రవేత్తలు సూచించిన ప్రతి వ్యవసాయ యాజమాన్య పద్ధతిని క్షేత్రస్థాయిలో రైతులకు చేరవేసి, వాటిని అమలు చేసే బాధ్యత జిల్లా యంత్రాంగం తీసుకోవాలి. ప్రతి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని విధాలుగా రైతుకు అండగా ఉంటుంది.” అని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, ఇక్రిశాట్ డిప్యూటి డైరెక్టర్ జనరల్ స్టాన్ఫోర్డ్ బ్లేడ్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, కమిషనర్ కోఆపరేషన్ రాహుల్ రాజ్, హాకా ఎండి చంద్రశేఖర్, గిడ్డంగుల శాఖ ఎండి లక్ష్మీ, TGSPDLC CMD జితేష్ పాటిల్, అగ్రి, హార్టికల్చర్ యూనివర్సిటీల వీసీలు జానయ్య, రాజిరెడ్డి, ఇక్రిశాట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ హరికిషన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.