- జిల్లాలో రూ.376.25 కోట్ల విలువైన విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవాలు.
- ఎర్రవల్లి వద్ద రూ.155 కోట్ల నిధులతో ఉప కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా ధ్యేయంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉప కేంద్రాలను నిర్మిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంగళవారం వడ్డేపల్లి మండలం శాంతినగర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు చాపర్ లో వచ్చిన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర అతిధులకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పుష్పగుచ్చాలు, మొక్కలతో స్వాగతం పలికి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. జులేకల్ గ్రామానికి రోడ్డు మార్గంలో చేరుకొని అలంపూర్ నియోజకవర్గంలోని జులేకల్, పచ్చర్ల, పుల్లూరు, మేడికొండ ప్రాంతాల్లో నిర్మించిన 33/11 కెవి ఉపకేంద్రాలను ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, మత్స్య, పశుసంవర్ధక, క్రీడల శాఖల మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. అలాగే ఎర్రవల్లి మండల కేంద్రం వద్ద రూ.155 కోట్ల నిధులతో 220/132/33 కెవి ఉపకేంద్రం నిర్మాణానికి కూడా ఇక్కడే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రసంగించారు. జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా మంగళవారం రూ.376.25 కోట్ల విలువైన విద్యుత్ ఉప కేంద్రాల ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, గొర్రెలు, మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సరిత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, ట్రాన్స్కో సీఎండి కృష్ణ భాస్కర్, టీజీ ఎస్పీడీసీఎల్ సిఎండి జితేష్ వి పాటిల్, సంస్థ డైరెక్టర్లు శివాజీ, నరసింహులు, రూరల్ జోన్ సీఈ బాలస్వామి, అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఇన్చార్జి ఎస్ఈ నాగరాజు, డిఈ రవి ప్రసాద్, ఇతర ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు, జిల్లా నేతలు, తదితరులు పాల్గొన్నారు.