హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(HMDA) సీఈ అక్రమాస్తులు రూ.100 కోట్లు!

  • చీఫ్‌ ఇంజినీర్‌ రవీందర్‌ ఇండ్లు, ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు
  • నిజామాబాద్‌, మెదక్‌, హైదరాబాద్‌లో తనిఖీలు
  • 11 చోట్ల సోదాల్లో రూ.100 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు

 హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (HMDA) చీఫ్‌ ఇంజనీర్‌(CE)గా పనిచేస్తున్న బచ్చు రవీందర్‌ ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ(ACB) అధికారులు గుర్తించారు. ఆయన ఇల్లు, ఆఫీసు, మిత్రులు, బంధువులు, బినామీల ఇళ్లల్లో మొత్తం 10 చోట్ల మంగళవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హెచ్‌ఎండీఏ సీఈగా ఆయన కీలక ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. రవీందర్‌ అక్రమార్జన మార్కెట్‌ విలువ ప్రకారం రూ.100 కోట్లకు పైగానే ఉండవచ్చని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. డాక్యుమెంట్‌ విలువ ప్రకారం రవీందర్‌కు సంబంధించిన రూ.9,24,02,276 ఆస్తులను గుర్తించామని వీటి మార్కెట్‌ విలువ ఇంతకు ఎన్నోరెట్లు ఎక్కువగా ఉంటుందని వారు ఒక ప్రకటనలో తెలిపారు. రూ.38,89,700 విలువ గల ఐదు ఇళ్ల స్థలాలు కొండకల్‌, కిష్టాపూర్‌, పసమామలలో, నార్సింగ్‌, నానక్‌రాం గూడలోని ఖరీదైన ప్రాజెక్టుల్లో రూ.2,07,40,000 విలువైన నాలుగు ఫ్లాట్లు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. సుమధుర అక్రోపాలిస్‌, వాసవి అట్లాంటిస్‌లో ఈ ఫ్లాట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం గూడురు గ్రామంలో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి, మోకిలలోని శ్రీవారి మెడోస్‌లో రూ.1,33,58,800 విలువైన విల్లా (300 గజాలు), మజీద్‌బండలో 300 గజాల్లో నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం రూ.3,00,00,000 ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. నానక్‌రాంగూడలోని రవీందర్‌ ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.3,82,000 నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.45లక్షల బ్యాలెన్స్‌, దాదాపు రూ.36,70,000 విలువైన 1,440 గ్రాముల బంగారు ఆభరణాలు, దాదాపు రూ.10లక్షల విలువైన వెండి వస్తువులు, రూ.17,24,000 విలువైన గృహోపకరణాలు, దాదాపు రూ.10 లక్షల విలువైన ఎలక్ర్టానిక్‌ గాడ్జెట్స్‌, రూ.1,16,00,000 విలువైన నాలుగు కార్లు (ఇన్నోవాలు రెండు, టాటా సఫారి, మహేంద్ర ఎక్స్‌యువి) గుర్తించామని, రవీందర్‌ను న్యాయమూర్తి ముందు హజరుపరచనున్నామని ఏసీబీ అధికారులు వివరించారు. హెచ్‌ఏండీఏలో రవీందర్‌ రోడ్లు, ఫ్లైఓవర్లు, ల్యాండ్‌ అక్విజిషన్‌, ఇంజనీరింగ్‌, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమన్వయం లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రవీందర్‌ విలాసవంతమైన జీవితానికి సంబంధించి ఫొటోలతో కూడిన ఫిర్యాదులు ఏసీబీకి అందడం తో ఆయనపై కొన్నాళ్లుగా నిఘాపెట్టారని తెలుస్తోంది. రవీందర్‌ విదేశీ ప్రయాణాల చిట్టాతో పాటు ఆయన భార్య ధరించిన ఆభరణాల ఫొటోలు, వారి వాహనాలు, ఖరీదైన ఇళ్లకు సంబంధించిన సమాచారం ఏసీబీకి గతంలో ఫిర్యాదుల రూ పంలో అందినట్లు సమాచారం. దీనిపై ప్రాథమిక విచారణ పూర్తిచేసిన తర్వాత ఈనెల 13న రవీందర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేసి సెర్చ్‌వారంట్‌ పొం దినట్లు తెలిసింది. రవీందర్‌కు కొందరు బినామీలు ఉన్నారని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఆయనకు సంబంధించిన 4 బ్యాంకు లాకర్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. రవీందర్‌ ఇంట్లో 18 విదేశీ మద్యం బాటిళ్లను గుర్తించి ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు.

  • కొండకల్‌, కిష్టాపూర్‌, పాసమలలో రూ. 38,89,700 విలువైన 5 ప్లాట్లు
  • నార్సింగి, నానక్‌రామ్‌గూడలో రూ. 2,07,40,000 విలువైన 4 ఫ్లాట్లు
  • కొత్తూరు మండలం గూడూరు, శంషాబాద్‌లో రూ.60 లక్షల విలువైన 4 ఎకరాల భూమి
  • శంకర్‌పల్లి మండలం, మోకిల, శ్రీవారి మెడోస్‌లో రూ. 1,33,58,800 విలువైన 300 చదరపు గజాల విల్లా
  • కొండాపూర్‌లోని మసీద్‌ బండ వద్ద రూ. 3 కోట్ల విలువైన 300 చదరపు గజాల జీ+4 భవనం
  • రూ.3,82,000 నగదు స్వాధీనం
  • రూ.45,05,776 బ్యాంక్‌ బ్యాలెన్స్‌
  • 1,440 గ్రాముల రూ. 36,70,000 విలువైన బంగారు ఆభరణాలు
  • 12.5 కిలోల రూ.10 లక్షల విలువైన వెండి ఆభరణాలు
  • రూ.17,24,000 విలువైన గృహోపకరణాలు
  • రూ.9,32,000 విలువైన ఎలక్ట్రానిక్‌ పరికరాలు స్వాధీనం
  • రూ.1,16,00,000 విలువైన 4 వాహనాలు (ఇన్నోవా రూ.40 లక్షలు, టాటా సఫారీ రూ.31లక్షలు, ఇన్నోవా క్రిస్టా రూ.25 లక్షలు, మహీంద్రా ఎక్స్‌యూవీ రూ. 20, లక్షలు)లను గుర్తించారు. ఆస్తుల విలువ రూ. 9, 24, 02,276 ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేయగా.. బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ.70 కోట్లకు పైగానే ఉంటుందని చెప్పారు.