హైదరాబాద్ : రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఈ రోజు సచివాలయంలో ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో H.E. Dr. Meidari, ఇరాన్ సహకార, కార్మిక మరియు సామాజిక సంక్షేమ శాఖ మంత్రి, Dr. Sarfi, సహకార శాఖ ఉపమంత్రి, H.E. Dr. Mohammad Fath Ali, భారతదేశంలోని ఇరాన్ రాయబారి, H.E. Hamid Ahmadiyeh, హైదరాబాద్లోని ఇరాన్ కాన్సుల్ జనరల్, Mr. Mohsin Moghaddami, వైస్ కాన్సుల్, Mr. Hashemi, ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో సహకార ఉద్యమం బలోపేతానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) పనితీరు, సభ్యత్వ విస్తరణ, రైతులకు అందిస్తున్న సేవలు, సహకార రంగంలో రాష్ట్రం సాధించిన పురోగతిని మంత్రి తుమ్మల ప్రతినిధి బృందానికి వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తోందని, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలులో సహకార సంఘాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు.
తెలంగాణలో అమలవుతున్న సహకార విధానాలు, సంస్థాగత సంస్కరణలు, సభ్యులకు అందిస్తున్న సేవలపై ఇరాన్ ప్రతినిధి బృందం ఆసక్తి వ్యక్తం చేసింది. భవిష్యత్తులో సహకార రంగంలో పరస్పర అనుభవాల మార్పిడి, సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాలపై ఇరు పక్షాలు చర్చించాయి. సమావేశం అనంతరం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి ఇరాన్ ప్రతినిధి బృంద సభ్యులను శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ప్రతినిధి బృందం కూడా మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించింది.