హైదరాబాద్: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్-నినో ప్రభావం, తీసుకోవాల్సిన కార్యాచరణపై జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు శనివారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో ప్రసుత్త పరిస్థితులపై సమీక్షించేందుకు ఆయా జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు జిల్లాల్లో పర్యటించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించనున్నారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న ఆ జిల్లా స్థాయి సమావేశాలకు నియమితులైన ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సిఎస్ ఆదేశించారు. ఎల్-నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు వ్యవసాయంపై చూపే ప్రభావం గురించి రైతులు, ప్రజాప్రతినిధులు, వారికి విస్తృత అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సిఎస్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అధిక శాతం జిల్లాల్లో ఇప్పటికే తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని సిఎస్ తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు, పరిస్థితులకు అనుగుణమైన వ్యవసాయ విధానాలు, అత్యవసర ప్రత్యామ్నాయ ప్రణాళికలపై అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు. పంటల వైవిధ్యీకరణ (Crop Diversification) ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకుని జీవనోపాధిని కాపాడుకోవచ్చని సూచించారు. రైతులకు శాస్త్రీయ, సాంకేతిక సమాచారాన్ని సమర్థవంతంగా చేరవేసే విధంగా ఈ కార్యక్రమాన్ని రోజంతా నిర్వహించేలా రూపొందించినట్లు సిఎస్ తెలిపారు. ఈ సమావేశాల్లో రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, ప్రభుత్వ అధికారులతో నేరుగా చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు, ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక, వ్యవసాయ నిర్వహణపై సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాల పరిధిలోని అన్ని జిల్లా కలెక్టర్లు సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, నీటిపారుదల తదితర శాఖల జిల్లా స్థాయి సీనియర్ అధికారులు కూడా తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సమావేశాల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయడంతో పాటు రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, విస్తరణాధికారులు, మీడియా ప్రతినిధులు, ఇతర భాగస్వాములు అధిక సంఖ్యలో పాల్గొనేలా జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, దానకిశోర్, నవీన్ మిట్టల్, బెన్‌హర్ ఎక్కా, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
