గురుకుల విద్యార్థులే తెలంగాణకు భవిష్యత్ బ్రాండ్ అంబాసిడర్లు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

  • పేదింటి పిల్లల కలలను నిజం చేస్తున్న గురుకులాలు
  • గురుకులాలే గొప్ప సమాన అవకాశాల వేదిక
  • పేద విద్యార్థుల విజయాలే మా ప్రభుత్వానికి నిజమైన పురస్కారం
  • నీట్‌ ర్యాంకర్లు, స్వర్ణ పతక విజేత సాయి ప్రవల్లికతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : పేదరికం ప్రతిభకు ఎప్పుడూ అడ్డంకి కాదని, సరైన అవకాశం, నాణ్యమైన విద్య, ప్రభుత్వ అండ ఉంటే గురుకుల విద్యార్థులు ప్రపంచ స్థాయిలోనూ సత్తా చాటగలరని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల (TGSWREIS)లో చదివి నీట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో పాటు,
చైనాలోని ఓర్డోస్‌లో నిర్వహించిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ – 2026లో మహిళల 4×400 మీటర్ల రిలే పోటీలో భారత జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం
సాధించిన సాయి ప్రవల్లికతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “గురుకులాల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి విజయం వెనుక ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల విశ్వాసం కలిసి ఉన్నాయి. ఈ విజయాలు ఒక్క విద్యార్థుల కుటుంబాలకు మాత్రమే కాదు… తెలంగాణ సమాజానికే గర్వకారణం” అని అన్నారు. గురుకుల విద్యాసంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, అత్యాధునిక వసతి, డిజిటల్‌ విద్య, ఉచిత నీట్‌, జేఈఈ, సివిల్స్‌ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, సబ్జెక్టు నిపుణుల పర్యవేక్షణను ప్రభుత్వం అందిస్తోందని మంత్రి వివరించారు.

“సామాజిక న్యాయం అంటే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు… పేద పిల్లలను దేశ అత్యున్నత విద్యాసంస్థల్లో చదివించి నాయకత్వ స్థానాలకు తీసుకెళ్లడం కూడా సామాజిక న్యాయమే. అదే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తోంది” అని మంత్రి పేర్కొన్నారు. ఆసియా స్థాయిలో స్వర్ణ పతకం సాధించిన సాయి ప్రవల్లికను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి, “విద్యతో పాటు క్రీడల్లోనూ గురుకుల విద్యార్థులు ప్రపంచ స్థాయిలో రాణించడం తెలంగాణ గురుకుల విద్యా వ్యవస్థ సామర్థ్యానికి నిదర్శనం. భవిష్యత్తులో మరింత మంది ఒలింపియన్లు, వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, సివిల్ సర్వెంట్లు ఈ గురుకులాల నుంచే రావాలి” అని ఆకాంక్షించారు. “మీరు సాధించిన ర్యాంకు మీ జీవితాన్ని మాత్రమే కాదు… మీ తర్వాత వచ్చే వేలాది మంది పేద విద్యార్థులకు స్ఫూర్తిని ఇస్తుంది. కష్టపడి చదివితే ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల నుంచే దేశ అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చని మీరు నిరూపించారు. మీ విజయ ప్రస్థానంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది” అని ప్రోత్సహించారు.

“తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యా వ్యవస్థను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతోంది. పేద విద్యార్థి కల ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నాం. ప్రతి గురుకుల విద్యార్థి విజయం మా ప్రభుత్వ విజయంగా భావించి, వారికి అవసరమైన ప్రతి అవకాశాన్ని కల్పిస్తాం” అని మంత్రి అడ్లురి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ…తమ పిల్లలకు కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, ఉచిత ప్రత్యేక కోచింగ్‌, అన్ని సౌకర్యాలు కల్పించి వారి కలలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో SCDD ముఖ్య కార్యదర్శి శ్రీమతి విజయేంద్ర బోయి IAS, TGSWREIS కార్యదర్శి (FAC) కంభంపాటి శారద, జాయింట్ సెక్రెటరీ (అకాడమిక్) సక్రు నాయక్, తదితరులు పాల్గొన్నారు.