ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేదే నిజమైన జర్నలిజం: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె. శివసేన రెడ్డి

ఆదివారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో అకాడమీ ఆధ్వర్యంలో, జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపర్చేందుకు నిర్వహిస్తున్న రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణా శిబిరం ప్రారంభమైంది. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కె. శివసేన రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ వృత్తి నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే నిష్పక్షపాత, బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని ఆచరించాలని పిలుపునిచ్చారు. కె. శివసేన రెడ్డి మాట్లాడుతూ, మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమని పేర్కొన్నారు. మారుతున్న సాంకేతిక పరిణామాలు, డిజిటల్ మీడియా విస్తరణ, సామాజిక మాధ్యమాల ప్రభావం నేపథ్యంలో జర్నలిస్టులు నిరంతరం తమ వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. రాజకీయ లేదా అధికార ఒత్తిళ్లకు లొంగకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాస్తవాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఫేక్ న్యూస్ వ్యాప్తి పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తవ నిర్ధారణ (ఫ్యాక్ట్ చెకింగ్), నైతిక విలువలు, విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చిన్న పత్రికలు, డిజిటల్ మీడియా, యూట్యూబ్ వేదికల్లో పనిచేసే జర్నలిస్టుల్లోనూ విశేష ప్రతిభ ఉందని, నిజాయితీతో పనిచేసే వారికి గుర్తింపు తప్పకుండా లభిస్తుందని పేర్కొన్నారు.

అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిజం వృత్తికి నిరంతర అధ్యయనం అవసరమైన అని పేర్కొన్నారు. ఎంతటి అనుభవం ఉన్నప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త పరిజ్ఞానం, సాంకేతికత, చట్టాలు, సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా మీడియా అకాడమీ శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఉపయోగపడే బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని అందించాలని ఆయన పిలుపునిచ్చారు. శిక్షణా శిబిరంలో సీనియర్ జర్నలిస్టులు దిలీప్ రెడ్డి, మార్కండేయ, సుధాకర్ రెడ్డి, గోవింద్ రెడ్డి డిజిటల్ జర్నలిజం, సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ), మీడియా నైతిక విలువలు, సమకాలీన జర్నలిజం అంశాలపై పాల్గొనేవారికి అవగాహన కల్పించారు..ఇతర నిపుణులు జర్నలిజంలో వృత్తి నైతిక విలువలు, వార్తా రచనలో ప్రమాణాలు, డిజిటల్ యుగంలో జర్నలిస్టులు అనుసరించాల్సిన బాధ్యతలు, మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ, వెట్టి చాకిరి నిర్మూలన, బాధితుల పునరావాసంలో మీడియా పోషించాల్సిన పాత్రపై సమగ్రంగా వివరించారు. అదేవిధంగా శిబిరంలో సామాజిక సందేశంతో రూపొందిన “నెరవేరిన కల” ఫీచర్ చిత్రాన్ని ప్రదర్శించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల జర్నలిస్టులు అకాడమీ నిర్వహించే రెండు రోజుల శిక్షణా శిబిరాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని తమ వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని, ప్రజలకు విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన, నిష్పక్షపాత జర్నలిజాన్ని అందించాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వరరావు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మధు, సీనియర్ జర్నలిస్టులు, నిపుణులు, వివిధ జిల్లాల నుంచి హాజరైన జర్నలిస్టులు, అధికారులు పాల్గొన్నారు.