ఎంఎస్ అగర్వాల్ కంపెనీని తొలగించాలి: మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి

  • గ్రామాల్లోనే బహిరంగ హియరింగ్ నిర్వహించాలని కలెక్టరేట్ వద్ద ఆందోళన
  • పోలీసుల మధ్య కాదు.. ప్రజల ముందే పబ్లిక్ హియరింగ్ చేయాలి
  • అధికారులు కంపెనీ కోసం కాదు.. ప్రజల ప్రాణాలు ముఖ్యం అనేలా పనిచేయాలి

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం, రంగయ్యపల్లి గ్రామాల సమీపంలోని ఎంఎస్ అగర్వాల్ ప్రైవేట్ లిమిటెడ్ స్టీల్ కంపెనీని వెంటనే తొలగించాలని కోరుతూ రెండు గ్రామాలకు చెందిన సుమారు 400 మంది గ్రామస్థులు సోమవారం మెదక్ కలెక్టరేట్‌ను ముట్టడించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా రెవెన్యూ అధికారి అంబదాస్ రాజేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా కంపెనీ నుంచి వెలువడుతున్న పొగ, దుమ్ము, శబ్ద కాలుష్యంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కాలుష్యం కారణంగా తాగునీటి వనరులు కలుషితమయ్యాయని, పంటలు దెబ్బతింటున్నాయని, ప్రజలు చర్మ, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. కంపెనీని తొలగించడం సాధ్యం కాకపోతే రెండు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రజల మధ్య జరగాల్సిన హియరింగ్‌ను పోలీసుల సమక్షంలో నిర్వహించడం సరికాదన్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా గ్రామాలకు వచ్చి బహిరంగ హియరింగ్ నిర్వహించి ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరారు. వారం రోజుల్లో చర్యలు తీసుకోకపోతే వేలాదిమందితో మళ్లీ కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. గ్రామస్థులు మాట్లాడుతూ, కంపెనీ కాలుష్యం కారణంగా ఇళ్లపై నల్లటి దుమ్ము పేరుకుపోతుండటంతో పాటు వర్షపు నీరు, చెరువులు, బోర్లు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీని వెంటనే తొలగించాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కాలుష్యంతో గ్రామాల్లో బతకలేకపోతున్నామని గ్రామస్థులు వాపోయారు. ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీ వల్ల చెట్ల గౌరారం, రంగయ్యపల్లి గ్రామాల ప్రజల జీవితం నరకప్రాయంగా మారిందన్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. కంపెనీ నుంచి వెలువడే నల్లటి పొగతో ఇళ్లు, బట్టలు, చెట్లు దుమ్ముతో కప్పుకుపోతుండగా.. వర్షపు నీటితో చెరువులు, బోర్లు కలుషితమై తాగునీరు, వ్యవసాయ భూములు దెబ్బతింటు న్నాయన్నారు. ప్రజల ఆరోగ్యం కంటే కంపెనీ ప్రయోజనాలకే అధికారులు పెద్దపీట వేస్తున్నట్లు కనిపిస్తోందని వాపోయారు. జిల్లా కలెక్టర్ స్వయంగా రెండు గ్రామాలకు వచ్చి ప్రతి కుటు ంబం అభిప్రాయాన్ని తెలుసుకుని ప్రజల నిర్ణయానికే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంపెనీని వెంటనే తొలగించి ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.