ఉద్యమకారుల సమగ్ర సంక్షేమానికి పర్మినెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత ఇవ్వాలి

  • డాక్టర్లు, అడ్వకేట్లు, జర్నలిస్టుల జేఏసీలతో ముఖాముఖి విజయవంతం..

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ (జీవో నెం. 679) ముఖాముఖి షెడ్యూల్‌లో భాగంగా నేడు అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) వద్ద వైద్యులు (Doctors JAC), న్యాయవాదులు (Advocate JAC), మరియు విలేఖరులు (Journalists JAC) సమక్షంలో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎమ్. కోదండరామ్, అద్దంకి దయాకర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, ఎస్. రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి పలువురు ప్రముఖ సామాజిక నాయకులు మరియు వివిధ వర్గాల అగ్రశ్రేణి ప్రతినిధులు హాజరయ్యారు. అల్లం నారాయణ (సీనియర్ జర్నలిస్ట్ నాయకులు), ఎమ్. రాజేందర్ రెడ్డి (అడ్వకేట్ జేఏసీ కన్వీనర్), ఎస్. సత్యం రెడ్డి (హైకోర్టు మాజీ ప్రెసిడెంట్)

టిఆర్‌ఎస్ (TRS) అధినేత్రి కల్వకుంట్ల కవిత మద్దతు — కేంద్ర ప్రభుత్వ జీవోల సమర్పణ: ఈ సమావేశానికి తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత స్వయంగా హాజరై కమిటీకి తమ పూర్తి మద్దతును ప్రకటించారు. భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో నాటి ఉద్యమకారుల గుర్తింపు కొరకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పలు చారిత్రాత్మక జీవోల (GOs) ప్రతులను కమిటీ ప్యానల్‌కు సమర్పించారు. జార్ఖండ్ తో పాటు ఇతర కొత్తగా ఏర్పాటైన రాష్ట్రాల్లో అమలు చేసిన ఉద్యమకారుల గుర్తింపు విధానాలను పరిశీలించి, తెలంగాణలో త్వరితగతిన అర్హుల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు స్పందిస్తూ.. “నేను జార్ఖండ్ రాష్ట్రానికి 3 సంవత్సరాల పాటు ఇన్ ఛార్జీగా పనిచేశాను. అక్కడ అమలైన విధానాలపై నాకు పూర్తి అవగాహన ఉంది. అంతకంటే మెరుగ్గా, నిబద్ధతతో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తాం. అన్ని రాజకీయా పార్టీల నుండి, ప్రజా సంఘాల నుండి వచ్చే సలహాలు, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటాం” అని తెలిపారు.

వివిధ రంగాలు లేవనెత్తిన ప్రధాన డిమాండ్లు:

  1. జర్నలిస్ట్ ఉద్యమకారుల డిమాండ్లు:
  • తెలంగాణ మీడియా రక్షణ: తెలంగాణ మీడియా చానల్స్ మరియు పత్రికల రక్షణ కొరకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు (Separate Funds) కేటాయించాలి.
  • జర్నలిస్టులకు గుర్తింపు: 250 గజాల నివాస స్థలం, ఉచిత రవాణా సౌకర్యం, పిల్లలకు ఉచిత నాణ్యమైన విద్య.
  • ప్రత్యేక ఆసుపత్రి: జర్నలిస్టుల కుటుంబ ఆరోగ్య రక్షణ కొరకు ప్రత్యేక హాస్పిటల్ సదుపాయం కల్పించాలి.
  1. అడ్వకేట్ జేఏసీ (Advocate JAC) డిమాండ్లు:
  • అడ్వకేట్ ఎమ్మెల్సీ (Advocate MLC): న్యాయవాద వ్యవస్థ మరియు ఉద్యమకారుల హక్కుల పరిరక్షణ కోసం శాసనమండలిలో అడ్వకేట్లకు ప్రత్యేక ఎమ్మెల్సీ స్థానాన్ని ఏర్పాటు చేయాలి.
  1. డాక్టర్స్ జేఏసీ (Doctors JAC) డిమాండ్లు:
  • డాక్టర్ల ఎమ్మెల్సీ & బదిలీల్లో పాయింట్లు: శాసనమండలిలో డాక్టర్లకు ప్రత్యేక ఎమ్మెల్సీ స్థానం ఏర్పాటు చేయాలి. ఉద్యమంలో పాల్గొన్న డాక్టర్లకు ప్రభుత్వ బదిలీల్లో (Transfers) ప్రత్యేక ప్రాధాన్యత పాయింట్లు ఇవ్వాలి.
  • గుర్తింపు కార్డులు & ఆయుష్ ఆసుపత్రులు: ఉద్యమకారులైన డాక్టర్లకు అధికారిక ఐడీ కార్డులు జారీ చేయాలి. ‘ఆరోగ్య తెలంగాణ’ సాధనకు ఆయుష్ (AYUSH) ఆసుపత్రుల సంఖ్యను పెంచాలి.
  1. కార్పొరేషన్ & కాలపరిమితి డిమాండ్:
  • శాశ్వత కార్పొరేషన్ (Permanent Corporation): ఉద్యమకారుల సంక్షేమం కోసం ఒక పర్మినెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ పోస్టులలో ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
  • ఈ ప్రక్రియ మొత్తానికి ఒక నిర్దిష్ట కాలపరిమితి (Time Limit) నివేదించాలి.
    కమిటీ భరోసా: కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. జర్నలిస్టులు, డాక్టర్లు, అడ్వకేట్లు ఉద్యమంలో చురుగ్గా పాల్గొని రాష్ట్రాన్ని సాధించారని, వారి ప్రతి డిమాండ్ అత్యంత సమంజసమైనదని పేర్కొన్నారు. డిజిటల్ విధానంలో రికార్డ్ చేసిన ఆధారాల ద్వారా ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూస్తామని, ఈ విజ్ఞప్తులన్నింటినీ క్రోడీకరించి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి నివేదిస్తామని స్పష్టం చేశారు.