- ఈ రాత్రి నుంచే 9 పంపింగ్ యూనిట్లు పూర్తి సామర్థ్యంతో ప్రారంభం
- ప్రజలకు నీటి భద్రతే ప్రభుత్వ లక్ష్యం… రాజకీయాలు కాదు
- కాళేశ్వరం కాంట్రాక్టర్ల నుంచి బీఆర్ఎస్‌కు రూ.1,400 కోట్లు వెళ్లాయని కవిత చేసిన ఆరోపణలకు హరీశ్ రావు సమాధానం చెప్పాలి
హైదరాబాద్ : దేవాదుల ఎత్తిపోతల పథకం కింద ఈ రాత్రి నుంచే 9 పంపింగ్ యూనిట్లు 24 గంటల పాటు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో తనను కలిసిన మీడియాతో ఆయన చిట్-చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల దేవాదుల ప్రాజెక్టుపై మంత్రుల బృందం నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. గోదావరి నుంచి వీలైనంత ఎక్కువ నీటిని ఎత్తిపోసి, దేవాదుల పరిధిలోని 9 జిల్లాలకు చెందిన 22 రిజర్వాయర్లను నింపడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధికారులు పంపులను గరిష్ట సామర్థ్యంతో నడపాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాజకీయ విమర్శలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. దేవాదుల ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేయడం మానేసి, కాళేశ్వరం ప్రాజెక్టులో తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో మొదట రూపొందించిన షీట్ పైల్ ఫౌండేషన్ డిజైన్‌ను ఎందుకు మార్చి సెకెంట్ పైల్ ఫౌండేషన్ అమలు చేశారో హరీశ్ రావు వివరించాలని మంత్రి ప్రశ్నించారు. ఆ నిర్ణయం వల్లే ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ఈ పరిస్థితికి చేరుకుందని అన్నారు. అలాగే, కాళేశ్వరం కాంట్రాక్టర్లు బీఆర్ఎస్‌కు రూ.1,400 కోట్లు చెల్లించారని ఎమ్మెల్సీ కే. కవిత చేసిన ఆరోపణలపై హరీశ్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
రైతులను తప్పుదోవ పట్టించడం మానేసి, ఆ ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని అన్నారు.
దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భూసేకరణ, అనుమతులు, నిర్మాణ పనులను వేగవంతం చేసి 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సుమారు 5.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తాగునీటి భద్రత కూడా గణనీయంగా మెరుగుపడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.